
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ప్రభాస్ కెరీర్‌లో హారర్-ఫాంటసీ జానర్‌లో మొదటి ప్రయత్నం కావడం, భారీ బడ్జెట్ మరియు గ్రాండ్ ప్రొడక్షన్ విలువల కారణంగా భారీ అంచనాలు ఏర్పడిన సినిమా. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమాని మారుతి అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌లో రూపొందించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం, ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ : ఆస్తులను కోల్పోయిన జమీందారీ కుటుంబానికి చెందిన రాజు అలియాస్ రాజా సాబ్ (ప్రభాస్), తన నానమ్మ – అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న గంగమ్మ (జరీనా వాహబ్)తో కలిసి సాదాసీదా జీవితం గడుపుతూ ఉంటుంది. అయితే, ఎప్పుడో తన యవ్వనంలో అమ్మవారి నగలు వెతికి తెస్తానని వెళ్ళిన భర్త కనకరాజు (సంజయ్ దత్) కోసం గంగమ్మ ఇంకా ఎదురుచూస్తుంది. ఒకరోజు అనుకోకుండా తన తాత ఫోటో కనిపించడంతో, రాజా సాబ్ హైదరాబాద్ వెళ్లి తాతను వెతకడం ప్రారంభిస్తాడు. తాతను వెతకడానికి ప్రయత్నిస్తూ, మొదటి చూపులోనే బ్లెస్సీ (నిధి అగర్వాల్) ప్రేమలో పడతాడు. కానీ ఆమెకు ప్రేమను ప్రపోజ్ చేసే ముందే భైరవి (మాళవిక మోహనన్) పరిచయం అవుతుంది. మరి రాజా సాబ్ తన తాతను వెతకగలాడా? కనకరాజు, గంగరాజు (సముద్రఖని) మధ్య జరిగే గొడవ ఏమిటి? రాజా సాబ్ ఈ సమస్యలను ఎలా పరిష్కరించాడో తెలుసుకోవాలంటే బిగ్ స్క్రీన్ మీద ఆసక్తితో చూడాల్సిందే…
ప్రభాస్ వన్-మ్యాన్ షో చేశారు. రాజా సాబ్ పాత్రలో ఆయన కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకుంటాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ డీసెంట్ స్క్రీన్ స్పేస్‌తో రొమాంటిక్ ట్రాక్స్‌ను బాగానే పూర్తి చేశారు, రిధి కుమార్ పరిమిత స్క్రీన్ స్పేస్‌లో కనిపించగా, జరీనా వహాబ్ నానమ్మ పాత్రలో ఎమోషనల్ షేడ్స్ బాగా ప్రెజెంట్ చేశారు. సంజయ్ దత్ విలన్ గా భయపెట్టడంలో సక్సెస్ అయినప్పటికీ, అతని పాత్రకు కొంత డెప్త్ మిస్ అయింది. సపోర్ట్ క్యారెక్టర్స్ (సప్తగిరి, జబర్దస్త్ మహేష్, వి.టి.వి గణేష్) కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ద్వారా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. సాంకేతికంగా, ఆర్ట్ డిజైన్, ప్రొడక్షన్ విలువలు, సెట్స్, CG వర్క్ మరియు గ్రాండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా నిలిచాయి. థమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నప్పటికీ కొంత లోపం కనిపించింది. కార్తీక్ పలాని కెమెరా వర్క్ ద్వారా విజువల్స్ గ్రాండ్ గా కన్పిస్తాయి, అయితే ఎడిటింగ్ కొంచెం బెటర్ కావాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగడం, కొంత ఫోర్స్డ్ సీన్స్ మరియు ప్రీ క్లైమాక్స్ వరకు ఆసక్తి తక్కువగా ఉండటం minor drawback గా ఉన్నాయి.
మొత్తానికి, ‘ది రాజా సాబ్’ ప్రభాస్ అభిమానుల కోసం మిస్ అయ్యే వింటేజ్ ఎంటర్టైనర్ ఫీలింగ్ ఇస్తుంది. తక్కువ అంచనాలతో, ఓపికతో చూసిన ఆడియన్స్ కి హారర్-ఫాంటసీ ఎలిమెంట్స్, గ్రాండ్ విజువల్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ తో ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక ఎంటర్టైనింగ్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ, గ్రాండ్-లెవల్ హారర్ ఫాంటసీ ఎక్స్పీరియన్స్ గా చెప్పవచ్చు.
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
