Rao Bhadur Movie Review
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
మహేష్ బాబు సమర్పణలో, సత్యదేవ్ ప్రధాన పాత్రలో, ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ విడుదలకు ముందే మంచి అంచనాలు సొంతం చేసుకుంది. “అనుమానం పెనుభూతం” అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? వెంకటేష్ మహా మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశాడా? తెలుసుకుందాం.
కథ : భువనం రాజ కుటుంబానికి చెందిన రావు బహదూర్ రామప్ప (సత్యదేవ్) లివర్ క్యాన్సర్ చివరి దశలో ఉన్నప్పటికీ మరణాన్ని ధిక్కరిస్తూ జీవిస్తుంటాడు. తన స్నేహితుడు, డాక్టర్ ఆచారితో (వికాస్ ముప్పాల) తన జీవితాన్ని వెంటాడుతున్న ఒక పెద్ద అనుమానాన్ని పంచుకుంటాడు. తన చిన్న కుమారుడు కుసుమప్ప జననం నుంచి మొదలైన ఆ అనుమానం రామప్ప జీవితాన్ని ఎలా మార్చింది? ఆ అనుమానం వెనుక నిజం ఏమిటి? చివరికి రామప్ప తన జీవితాంతంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాడా? అనేదే సినిమా ప్రధాన కథ.
విశ్లేషణ :
వెంకటేష్ మహా ఈసారి ‘అనుమానం’ అనే భావోద్వేగాన్ని కేంద్రంగా తీసుకుని సైకలాజికల్ డ్రామాను రూపొందించాడు. ఒక వ్యక్తిలో పుట్టిన అనుమానం అతని కుటుంబాన్ని, జీవితాన్ని, మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా ప్రారంభంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో దర్శకుడు పాత్రలను, వారి నేపథ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువ సమయం కేటాయించడంతో కొంతమందికి సాగదీతగా అనిపించే అవకాశం ఉంది. సెకండాఫ్‌లో మాత్రం కథ అసలు ట్రాక్‌లోకి వస్తుంది. ఒక్కో సన్నివేశం వెనుక ఉన్న అర్థం బయటపడుతూ కథనం ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా చివరి 40-45 నిమిషాలు సినిమాకు ప్రధాన బలం. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ ట్విస్ట్ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.
అయితే సినిమా చుట్టూ ఏర్పడిన భారీ హైప్ కారణంగా చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే కొంత నిరాశ కలిగే అవకాశం ఉంది. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఇది మంచి ఎంగేజింగ్ సైకలాజికల్ డ్రామాగా అనిపిస్తుంది. రంగు, కులం, కుటుంబ వ్యవస్థ, మగవారి అనుమాన స్వభావం వంటి అంశాలపై వెంకటేష్ మహా రాసుకున్న డైలాగులు బాగా ఆకట్టుకుంటాయి.
ప్లస్ పాయింట్స్
సత్యదేవ్ అద్భుతమైన నటన
సెకండాఫ్ స్క్రీన్‌ప్లే
క్లైమాక్స్ ట్విస్ట్, ఎమోషన్స్
సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
వికాస్ ముప్పాల నటన
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్
కథలో కొంత రొటీన్ ఫీలింగ్
కొన్ని ట్విస్ట్స్ ముందే ఊహించగలగడం
నిడివి ఎక్కువగా అనిపించడం
భారీ హైప్‌ను పూర్తిగా అందుకోలేకపోవడం
నటీనటుల పెర్ఫార్మెన్స్
సత్యదేవ్ మరోసారి తన నటనతో సినిమాను నిలబెట్టాడు. యువకుడి నుంచి వృద్ధుడి వరకు విభిన్న వయసుల్లో అతని ట్రాన్స్‌ఫర్మేషన్, ఎమోషనల్ సీన్స్‌లో నటన అద్భుతంగా నిలిచాయి.
దీపా థామస్కు స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ తన పాత్రలో సహజంగా నటించింది.
వికాస్ ముప్పాల డాక్టర్ పాత్రలో ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం కీలక పాత్రలో కనిపిస్తూ మంచి నటన కనబరిచారు.
పనిమనిషి పాత్ర చేసిన బాల పరస కామెడీ టైమింగ్‌తో మెప్పించగా, రామప్ప ఇద్దరు కుమారుల పాత్రలు చేసిన నటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : ‘రావు బహదూర్’ అనుమానం, కుటుంబ బంధాలు, మానసిక సంఘర్షణల చుట్టూ తిరిగే సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా. నెమ్మదిగా సాగే కథనాన్ని ఓపికగా ఫాలో అయ్యే ప్రేక్షకులకు సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే భారీ అంచనాలతో వెళితే మాత్రం కొంత నిరాశ కలిగించవచ్చు.
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
