
రేటింగ్ 3/5
Veerabhadruni Rahasyam Review: 1990లలో టెలివిజన్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసిన కల్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘మర్మదేశం’ విశ్వం నుంచి వచ్చిన కొత్త వెబ్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’. గ్రామీణ జానపద నమ్మకాలు, మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంశాలను మేళవిస్తూ రూపొందిన ఈ లాంగ్-ఫార్మ్ సిరీస్‌ను జీ5 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మొత్తం 60 ఎపిసోడ్లుగా ప్లాన్ చేసిన ఈ కథలో ప్రస్తుతం విడుదలైన తొలి ఐదు ఎపిసోడ్లు ఎంతవరకు ఆకట్టుకున్నాయో చూద్దాం.
కథ
వీరభద్రపురం అనే మారుమూల గ్రామంలో గ్రామదైవం వీరభద్రుడిపై ప్రజలకు అపారమైన భక్తితో పాటు భయం కూడా ఉంటుంది. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే వీరభద్రుడే శిక్షిస్తాడని అందరూ నమ్ముతుంటారు. ఆ నమ్మకానికి బలంగా నిలిచేలా ఆలయంలోని ధర్మగంట మోగిన ప్రతిసారీ ఒక మృతదేహం బయటపడుతూ ఉంటుంది. గ్రామస్తులంతా దాన్ని దైవ తీర్పుగా భావించి మౌనంగా ఉంటారు.
అలాంటి సమయంలో తన తండ్రి రామస్వామిని వెతుక్కుంటూ నగరం నుంచి వెన్నెల అనే యువతి వీరభద్రపురానికి వస్తుంది. మరో హత్య చోటుచేసుకోవడంతో గ్రామస్తులు దానిని కూడా దేవుడి శిక్షగానే భావిస్తారు. కానీ హేతువాదిగా ఉన్న వెన్నెల మాత్రం ఈ మరణాల వెనుక మనుషుల కుట్ర ఉందని అనుమానించి నిజానిజాలను వెలికితీయాలని నిర్ణయించుకుంటుంది. ఇక మరోవైపు కథ 1972, 1992 కాలాల మధ్య సమాంతరంగా సాగుతుంది. చిన్నతనంలో అడవిలో తప్పిపోయిన కార్తికేయకు వీరభద్రుడు ప్రత్యక్షమవడం, అతనికి ఒక రహస్యమైన కత్తిని ఇవ్వడం వంటి సంఘటనలు ప్రధాన కథతో ఎలా ముడిపడ్డాయి? ధర్మగంట వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ‘వీరభద్రుని రహస్యం’.
పాజిటివ్ పాయింట్స్
మిస్టరీ, ఫోక్‌లోర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంశాల కలయిక ఆసక్తికరంగా ఉంది.
1972, 1992 టైమ్‌లైన్లను కన్ఫ్యూజన్ లేకుండా నడిపించిన స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది.
ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే సస్పెన్స్ తదుపరి భాగంపై ఆసక్తిని పెంచుతుంది.
గ్రామీణ వాతావరణం, దేవాలయం చుట్టూ సృష్టించిన మిస్టరీ మూడ్ బాగా వర్కవుట్ అయింది.
నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ సిరీస్‌కు ప్రత్యేక బలంగా నిలిచాయి.
ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి చూడొచ్చు.
నెగెటివ్ పాయింట్స్
కథనం చాలా నిదానంగా సాగుతుంది.
తొలి ఐదు ఎపిసోడ్లలో ప్రధాన రహస్యాలపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు.
లాంగ్-ఫార్మ్ కథనం కారణంగా కొన్ని సన్నివేశాలు సాగదీసిన భావన కలుగుతుంది.
వేగవంతమైన థ్రిల్లర్‌ను ఆశించే ప్రేక్షకులకు నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది.
నటీనటుల పనితీరు
వెన్నెల పాత్రలో అన్నీ చాలా సహజంగా నటించింది. గ్రామంలోని మూఢనమ్మకాలను ప్రశ్నించే ధైర్యవంతురాలిగా ఆమె నటన కథకు బలాన్ని చేకూర్చింది. యోగానందం పాత్రలో రఘు కుంచె తన అనుభవాన్ని మరోసారి నిరూపించారు. ఆయన పాత్రలోని ప్రశాంతత, గంభీరత ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. యోగానందం తల్లి పాత్రలో అనురాధ తక్కువ నిడివిలో కనిపించినప్పటికీ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి ప్రభావాన్ని చూపించారు. సీఐ రవి పాత్రలో అభినవ్, ప్రొఫెసర్ నంద పాత్రలో కమల్ తూము, కార్తికేయ పాత్రలో రఘు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
ఫైనల్‌గా:
‘వీరభద్రుని రహస్యం’ తొలి ఐదు ఎపిసోడ్లు కథను పూర్తిగా చెప్పకపోయినా, ప్రేక్షకుల్లో బలమైన ఆసక్తిని మాత్రం రేకెత్తిస్తాయి. పాత ‘మర్మదేశం’ శైలిని గుర్తు చేస్తూనే కొత్త తరానికి తగ్గ మిస్టరీ, ఫోక్‌లోర్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో సిరీస్‌ను రూపొందించారు. నిదానమైన కథనాన్ని ఆస్వాదించే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. మొత్తం మీద ‘వరల్డ్ ఆఫ్ వీరభద్రుని రహస్యం’కు మంచి ఆరంభం అని చెప్పొచ్చు.
రేటింగ్ 3/5
