Site icon TeluguMirchi.com

మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వీరంగం సృష్టిస్తుంది. రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1892 కేసులు నమోదు అయ్యి రికార్డు సృష్టించగా… తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడింది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో నాలుగు రోజుల క్రితం ఆమె యశోదా హాస్పిటల్‌లో చేరారు. టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్త, నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కూడా టెస్టులు చేయగా రిపోర్టులు రావాల్సి ఉంది.

కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వ విప్ సునీత స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. కరోనా ప్రారంభ దశలోనే ఉందన్న ఆమె ట్రీట్మెంట్ కొనసాగుతోందన్నారు. ఇక ఇప్పటివరకు కరోనా బారిన పడిన రాజకీయ నేతల వివరాల్లోకి వెళ్తే..

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (జనగామ) కాగా.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కూడా కోవిడ్ బారిన పడ్డారు. హోం మంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడగా.. కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా కోవిడ్ నుంచి కోలుకున్నారు.

Exit mobile version