
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రెండు స్పెషల్ ఈవెంట్లు. అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసులకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తూ .. సరికొత్త హంగులతో ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఘనంగా జరిగింది ఈ వేడుక.
ఇక రెండో వేడుక విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి జగన్ తర్వాత పార్టీలో అంతటి ప్రాముఖ్యం వున్న నాయకుడు, పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పుట్టిన రోజు కూడా ఈ రోజే. ఆయనపై ఉదయం నుండి శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది. పార్టీ నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు ఇలా అందరూ విజయాసాయి కి బర్త్ డే విషెష్ అందించారు.
ముఖ్యంగా విశాఖ పట్నంలో ఒక రోజుముందే విజయసాయి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు హోర్డింగ్స్ కట్ అవుట్స్ ఏర్పాటు చేశారు. జగన్ తరువాత పార్టీలో నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి విశాఖలో తనదైన రాజకీయ నైపుణ్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. విశాఖలో విజయసాయి ధీటైన నేతగా ముద్ర వేసుకున్నారు.
ఇక జగన్ కి సాయిరెడ్డికి మధ్య అనుబంధం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. యల్లో మీడియా ఎన్ని కూతలు కూసిన.. ఆ కూతులకు ‘సైరా” పంచులతో అదరగొడుతుంటారు సాయిరెడ్డి. జగన్, విజయసాయి ఇచ్చే ప్రాధాన్యతని చూసి కుళ్ళుకుని అవాకులు చవాకులు ప్రచారం చేసే వాళ్ళూ వున్నారు. అయితే ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన అవి బూమరాంగ్ ప్రయత్నాలుగానే మిగిలిపోతుంటాయి.
ఎందుకంటే .. జగన్, సాయి రెడ్డిలది ఈనాటి అనుంబంధం కాదు. అవకాశవాద రాజకీయం అస్సల్ కాదు. కష్టాల్లో ఒక్కటిగా వున్నారు. ఇబ్బందులని కలసి పంచుకున్నారు. అన్యాయంగా ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదురుకున్నారు. ఎంతమంది ఒక్కటై .. వంటరిని చేసినా.. ఏనాడూ ఒకరిని ఒకరు వదిలి వుండలేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఒక్కటి నిలబడి, ప్రజల అభిమానాన్ని గెలుచుకొని విజయాన్ని సాధించారు.
ఇప్పుడు వైసీపీలో విజయసాయి నెంబర్ 2 అంటే .. అది ఆయనకి ఆయన తీసుకున్న స్థానం కాదు .. జగన్ మనసులో వున్న స్థానం అని తెలిసినవారు చెబుతారు. ఈ నెంబర్లు పక్కన పెడితే.. విజయసాయి రెడ్డి మాత్రం.. ” ప్రజాసేవలో జగన్ వెంట నడవడం తప్పితే తనకు మరో ఆలోచన లేదని, నాయకుడు ఒక్కడే .. అది మా జగనన్నే” అంటారు.
ఇక పార్టీ శ్రేణులకు కూడా విజయసాయి రెడ్డి అంటే ప్రత్యేక అభిమానం. కష్టకాలంలో జగన్ వెంటనిలిచిన వ్యక్తిగా విజయసాయిపై అపారమైన గౌరవం. అంతేకాదు.. జగన్ ని అభిమానించడంలో కూడ విజయసాయి సాటి ఎవరూలేరని పార్టీ క్యాడర్, కార్యకర్తలు, అభిమానులు స్వయంగా కితాబిస్తారు.
