
తెరపై కనిపించాలని ఎవరికైనా ఉంటుంది..దానిని క్యాష్ చేసుకుంటూ కొంతమంది మోసగాళ్లు జేబులు నింపుకుంటున్నారు. అవకాశం ఇప్పిస్తానంటూ చెపుతూ డబ్బులు లాగుతున్న సంఘటనలు ఇప్పటికే పలుమార్లు బయటపడగా..తాజాగా గీతాఆర్ట్స్ పేరుతో ఓ కేటుగాడు చేస్తున్న మోసం బయటపడింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన తమిళ్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలకు వల విసురుతున్నాడు. గీతా ఆర్ట్స్‌లో డిజైనర్, మేకప్‌మెన్‌గా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నాడు. అలా అతని మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోతున్నారు. అయితే, ఈ విషయం గీతా ఆర్ట్స్ దృష్టికి వచ్చింది. దీంతో ఆ ప్రతిష్టాత్మక సంస్థ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు గీతా ఆర్ట్స్ మేనేజర్ సత్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న తమ బ్యానర్ పేరు చెప్పి అమాయకులైన అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో సత్య కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
