Site icon TeluguMirchi.com

Chandrasekhar Reddy: అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్.. టిన్ షీట్లతో రచ్చ రచ్చ!

ChandraShekarReddy

Chandrasekhar Reddy: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ నానక్‌రామ్‌గూడ వేదికగా భూవివాదం భగ్గుమంది. ప్రముఖ సినీ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ, రాజకీయ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి అక్రమంగా చొరబడి, గేటు తాళాలు పగలగొట్టి, సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారంటూ స్థానిక ఓనర్స్ అసోసియేషన్ సంచలన ఫిర్యాదు చేయడం నగరంలో పెను దుమారం రేపుతోంది. నానక్‌రామ్‌గూడలోని మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోని స్థలానికి సంబంధించి కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం అక్కడకు చేరుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో జరిగిన పరిణామాలపై అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

ప్రాంగణం ప్రధాన గేటు తాళాలను దౌర్జన్యంగా పగులగొట్టి ఆయన తన అనుచరులతో లోపలికి వచ్చి, విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు అడ్డుకునేందుకు ప్రయత్నించాడని అన్నారు. అలాగే వారిపై దౌర్జన్యానికి దిగి, తీవ్రంగా బెదిరించినట్లు పేర్కొన్నారు. అక్కడున్న నిర్మాణాలను సైతం ధ్వంసం చేయడంతో పాటు తమ స్థలాన్ని ఆక్రమించే ఉద్దేశంతో దౌర్జన్యంగా టిన్‌షీట్లను ఏర్పాటు చేశారని బాధితులు ఆరోపించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, ఫొటోలను ఆధారాలుగా సమర్పిస్తూ మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలంటూ డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీలకు కూడా ఫిర్యాదులను అందజేశారు. ఐటీ కారిడార్ పరిధిలో నివసించే కుటుంబాలు, ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లకుండా అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అగ్ర హీరో బంధువు కావడంతో పాటు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిపై ఈ తరహా ఆరోపణలు రావడం, పోలీస్ కేసుల వరకు వ్యవహారం వెళ్లడం ఇటు సినీ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

Exit mobile version