Site icon TeluguMirchi.com

BRS : కరీంనగర్ బీసీ సభ వాయిదా.. వర్షాల కారణమా, రాజకీయ వ్యూహమా.?

Kcr

BRS : తెలంగాణ రాజకీయాల్లో బీసీ అంశం ఉత్కంఠ రేపుతున్న వేళ, బీఆర్ఎస్ చేపట్టబోయే కీలక బీసీ సభ వాయిదా వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఈనెల 8న కరీంనగర్‌లో నిర్వహించాల్సిన సభను వాయిదా వేయాలన్న ఆలోచనతో కేసీఆర్ ముందుకు సాగుతున్నట్టు సమాచారం. అధికారిక కారణంగా భారీ వర్షాలను చూపుతున్నప్పటికీ, దీని వెనుక రాజకీయ లెక్కలే ఎక్కువగా ఉన్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన కీలక సమావేశంలో కేసీఆర్, కేటీఆర్, బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. సభ ప్రాధాన్యత, వాతావరణ పరిస్థితులు, ప్రజల ఉత్సాహం వంటి అంశాలపై సమీక్ష జరిగింది. భారీ వర్షాల కారణంగా సభ వాయిదా ప్రతిపాదనపై చర్చించినట్టు సమాచారం.

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ధర్నా జాతీయ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్లను సెంట్రల్ డిబేట్‌గా మార్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీకి సూటిగా సవాల్ విసిరిన ఘటన కాంగ్రెస్‌ను బలంగా ముందుకు నెట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వాయిదా నిర్ణయం రాజకీయ వ్యూహం భాగమై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్ సభ ముందుగానే జరిగి ఉంటే బీసీ అజెండాను బీఆర్ఎస్ వైపు తిప్పుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ బలంగా మైదానంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్ ప్రచారానికి సమానంగా ప్రతిస్పందించడానికి బీఆర్ఎస్ కొత్త వ్యూహంతో ముందుకు రావాలనే ఆలోచనలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సభ వాయిదాపై అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, పార్టీ వర్గాల ప్రకారం నిర్ణయం దాదాపు ఖరారైంది. కొత్త తేదీని ప్రకటించే సమయంలో బీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహాన్ని ఎలా మార్చుకుంటుందో, కాంగ్రెస్ బీసీ అజెండాకు ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.

Exit mobile version