Site icon TeluguMirchi.com

Telangana Politics: అసెంబ్లీ ముందు రణరంగం.. 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు

BRS MLAs

Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘర్షణల వ్యవహారం మరింత ముదిరింది. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. అసెంబ్లీ పరిసరాల్లో విధుల్లో ఉన్న పోలీసులను బీఆర్ఎస్ నేతలు నెట్టివేశారని, కొందరు పోలీసుల కాలర్లు పట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా విధుల్లో ఉన్న పోలీసులను దూషించడం, బెదిరించడం వంటి ఆరోపణలపై కూడా కేసులు నమోదు చేశారు. మహిళా పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సీఐ బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజీతో పాటు మీడియా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా ఘటనలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాతా మధుసూదన్‌పై స్పీకర్‌ను కులదూషణకు గురిచేశారనే ఆరోపణలతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా.. నవీన్ కుమార్ రెడ్డిపై పోలీసులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో కేసు నమోదైనట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల వేళ బీఆర్ఎస్ నేతలపై వరుసగా కేసులు, అరెస్టులు చోటుచేసుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది.

Exit mobile version