
Thippiri Tirupathi: తుపాకీ పట్టిన చేతులతో ఒకప్పుడు అడవులను శాసించిన మాజీ మావోయిస్టు అగ్రనేత తాజాగా వెలువడిన లాసెట్ (LAWCET) ఫలితాల్లో ఆయన స్టేట్ లెవెల్లో ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా. మావోయిస్టు పార్టీ మాజీ సెంట్రల్ కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ (దేవ్‌జీ). తుపాకీని వదిలి జనాల్లోకి వచ్చిన ఆయన ఇటీవల నిర్వహించిన ఐదేళ్ల న్యాయ విద్య కోర్సు ప్రవేశ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచారు. తాజాగా విడుదలైన తెలంగాణ లాసెట్ ఫలితాల్లో ఆయన స్టేట్ లెవెల్లో 349వ ర్యాంకు సాధించారు.
57 మార్కులతో సత్తా
రాష్ట్రవ్యాప్తంగా గురువారం విడుదలైన లాసెట్ ఫలితాల్లో దేవ్‌జీ తన ప్రతిభను చాటుకున్నారు. ఐదేళ్ల లా కోర్సు ప్రవేశ పరీక్ష రాసిన ఆయన మొత్తం 57 మార్కులతో, 349వ ర్యాంకును సాధించారు. దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తిప్పిరి తిరుపతి.. ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన విషయం తెలిసిందే. అడవి బాట వీడిన తర్వాత ఆయన తన చదువుపై దృష్టి పెట్టడం విశేషం.
44 ఏళ్ల తర్వాత ఇంటర్ పరీక్ష..
దేవ్‌జీ విద్యాభ్యాస ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన 1980-82 కాలంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ (MPC) చదివారు. అయితే అప్పట్లో ఒక సబ్జెక్టు మిగిలిపోవడం, ఆ తర్వాత ఆయన ఉద్యమ బాట పట్టడంతో చదువు మధ్యలోనే ఆగింది. దాదాపు 44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, న్యాయ విద్య చదవాలనే పట్టుదలతో ఆయన ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. ఈ ఏడాది మే 13న ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రాశారు. ఈ ఫలితాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఒకప్పుడు అజ్ఞాతంలో గడిపిన దేవ్‌జీ.. ఇప్పుడు లొంగిపోయిన కొన్ని నెలల్లోనే ఇంటర్ పరీక్ష రాయడమే కాకుండా, లాసెట్‌లో స్టేట్ లెవెల్ ర్యాంక్ సాధించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పట్టుదలను పలువురు అభినందిస్తున్నారు.
