Site icon TeluguMirchi.com

HYDRAA operation: హస్మత్‌పేటలో ‘హైడ్రా’ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్.. పేదల ఇళ్లు కాదు, బద్దలైంది రూ.750 కోట్ల భూ మాఫియా కోట!

HYDRAA

HYDRAA operation: హస్మత్‌పేటలో హైడ్రా (HYDRAA) చేపట్టిన కూల్చివేతలపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని వాస్తవాలు స్పష్టం చేస్తున్నాయి. నిరుపేదల ఇళ్లను కూల్చేశారంటూ కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, అది కేవలం రాజకీయ ప్రేరేపితమైనదని తేలిపోయింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా జరుగుతున్న ఈ ప్రచారాల వెనుక అసలు నిజాలు వేరేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

108 ఎకరాల ప్రభుత్వ భూమి.. మిగిలింది 10 ఎకరాలే!
హస్మత్‌పేటలోని సర్వే నంబర్-1 లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే దశాబ్దాలుగా సాగిన అక్రమ ఆక్రమణల కారణంగా ఇప్పటికే అందులో ఏకంగా 98 ఎకరాలు కబ్జాకోరుల పాలైపోయింది. చివరికి ప్రభుత్వానికి మిగిలింది కేవలం 10 ఎకరాలు మాత్రమే. మిగిలిన చివరి 10 ఎకరాలనైనా కాపాడి, భవిష్యత్ తరాల ప్రజా అవసరాలకు ఉపయోగించాలనే ఉద్దేశంతోనే హైడ్రా రంగంలోకి దిగింది.

కూల్చింది అక్రమ కట్టడాలే
ఈ ఆపరేషన్‌లో గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రజలు నివసిస్తున్న ఏ ఒక్క శాశ్వత ఇంటి జోలికి కూడా వెళ్లలేదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. జీవో నెం. 58, 59 కింద క్రమబద్ధీకరణ (రెగ్యులరైజ్) అయిన ఇళ్లను కూల్చేశారనే ప్రచారంలో అస్సలు నిజం లేదని చెప్పారు. రెవెన్యూ శాఖ అధికారుల అధికారిక లేఖ ఆధారంగా, వారి సమక్షంలో, పోలీసు బందోబస్తుతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూమిపై కొత్తగా వేసిన ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లు, అక్రమ కంచెలు, ప్లాట్లుగా విభజించేందుకు చేసిన ఏర్పాట్లను మాత్రమే తాము తొలగించినట్లు పేర్కొన్నారు.

నిజానికి ఇది తాము స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదని, రెవెన్యూ శాఖ అధికారుల లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిని రక్షించేందుకు చేపట్టిన చట్టబద్ధమైన పరిపాలనా చర్య మాత్రమేనని హైడ్రా అధికారులు చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని వెల్లడించారు. ప్రస్తుతం హైడ్రా కబ్జాదారుల బారి నుంచి కాపాడిన ఈ 10 ఎకరాల భూమి మార్కెట్ విలువ సుమారు రూ. 750 కోట్లు. ఇంత విలువైన ప్రభుత్వ ఆస్తి కూడా కబ్జాకు గురైతే, భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, రోడ్ల వంటి ప్రజా అవసరాల కోసం భూమి ఎక్కడి నుంచి వస్తుందనేది ఇక్కడ అసలు ప్రశ్న. ప్రభుత్వ భూములు అంటే అవి ప్రతి పౌరుడి ఆస్తి. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యతను నిర్వర్తించిన అధికారుల చర్యను రాజకీయ కోణంలో చూడటం సరికాదని చెబుతున్నారు. హస్మత్‌పేటలో జరిగింది పేదల ఇళ్ల కూల్చివేత కాదని… దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ కబ్జాలకు చెక్ పెడుతూ, రూ. 750 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని రక్షించిన సాహసోపేతమైన చర్య అని వెల్లడించారు. కాబట్టి ప్రజలు కొందరి స్వార్థ రాజకీయ ప్రచారాలను నమ్మకుండా, వాస్తవాలను గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు కోరారు.

Exit mobile version