Site icon TeluguMirchi.com

KTR : పవన్ కళ్యాణ్ కు కేటీఆర్ కౌంటర్.. తెలంగాణకు అసలైన OG కేసీఆరే!

Ktr pawankalyan
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ దేశంలో ఎవరైనా పార్టీ స్థాపించవచ్చని, ఏ ప్రాంతంలోనైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొన్న ఆయన, గతంలో పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో పోటీ చేశారని, ఆయనను ఎవరూ అడ్డుకోలేదని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం సాధారణంగా ఏర్పడలేదని, ఎన్నో త్యాగాలు, ఉద్యమాల ఫలితంగా ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకునే వారు ముందుగా ఆ ప్రాంత ప్రజల భావోద్వేగాలు, చరిత్రను అర్థం చేసుకోవాలని సూచించారు.

తెలంగాణలో ప్రాంతీయ వాదం ఉందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం కూడా ప్రాంతీయ వాదమేనా అని ప్రశ్నించారు. దేశభక్తి గురించి పవన్ కల్యాణ్ వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని Narendra Modi పాలనలో తెలంగాణకు రావాల్సిన అనేక పరిశ్రమలు గుజరాత్‌కు తరలిపోయాయని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిగా గౌరవిస్తామని, నటుడిగా అభిమానిస్తామని, ఇంటికి వస్తే బిర్యానీ పెట్టి ఆతిథ్యం ఇస్తామని, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు.

“ఓజీ” సినిమా తీసిన పవన్ కల్యాణ్‌కు, తెలంగాణకు అసలైన “ఓజీ” కేసీఆర్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2014 నుంచే తెలంగాణను అస్థిరపరిచే ప్రయత్నాలు జరిగాయని, రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ఆవేశంలో మాట్లాడి ఉండవచ్చని భావిస్తున్నానని, కానీ ఆయన ఊహించిన విధంగా పరిణామాలు జరిగితే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే ఆ ఉద్యమానికి బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version