Site icon TeluguMirchi.com

KTR : ఫ్యూచర్ సిటీ ఎక్కడుంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్!

Ktr
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విస్తృతంగా స్పందించారు. కాంగ్రెస్ మెడపై కత్తి పెట్టి తెలంగాణ సాధించామని, తెలంగాణ ఉద్యమం అనేది ఒక్కరోజులో జరిగినది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, 1968 నుంచి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా విజయవంతమైందని చెప్పారు. 2001లో కేసీఆర్ పార్టీ స్థాపించి ఉద్యమానికి కొత్త ఊపు తీసుకువచ్చారని, “సచ్చుడో తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో ఆయన చేసిన పోరాటం కారణంగానే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేశారని, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లో అపూర్వమైన అభివృద్ధి సాధించారని అన్నారు.

తెలంగాణలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని దేశంలోని ఏ రాష్ట్రంతోనైనా పోల్చి చూపించాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం, రైతులకు అండగా నిలవడం, ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కనిపించవని చెప్పారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందంటూ దుష్ప్రచారం చేశారని, కానీ తమకు అధికారం కోల్పోయిన బాధ కంటే తెలంగాణ ఆశయాలు నెరవేరడం లేదన్న ఆందోళనే ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి కలలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. “రైజింగ్ తెలంగాణ” అని చెబుతున్న ప్రభుత్వం పాలన మాత్రం “ఫాలింగ్ తెలంగాణ”లా ఉందని ఎద్దేవా చేశారు. భూ వేలాల ద్వారా భారీ ఆదాయం వస్తోందని చెబుతున్న ప్రభుత్వం ఆ నిధులను ఎక్కడ వినియోగిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు విద్యుత్ మీటర్ల అంశంపై కూడా ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, భవిష్యత్తులో రైతులపై మరింత భారం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఎక్కడ ఉందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరిన కేటీఆర్, జర్నలిస్టులకు నిజమైన న్యాయం కేసీఆర్ పాలనలోనే జరిగిందని అన్నారు. అలాగే బాల్క సుమన్ వ్యాఖ్యలు తప్పేనని అంగీకరిస్తూనే, అదే ప్రమాణాలతో ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Exit mobile version