Site icon TeluguMirchi.com

ACB Raids: ఆర్అండ్‌బీలో అవినీతి తిమింగలం.. మోహన్ నాయక్ ఇళ్లలో కిలోల కొద్దీ బంగారం, కోట్లలో ఆస్తులు!

ACB Raids

ACB Raids: తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో భారీ దాడులకు శ్రీకారం చుట్టారు. రోడ్లు – భవనాల శాఖ (R&B) ఇంజినీర్ ఇన్‌ చీఫ్ (ENC) జే.మోహన్ నాయక్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచే మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు.

మియాపూర్ విల్లాలో ఆరా
మోహన్ నాయక్ తన అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిల నేతృత్వంలోని 16 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు మోహన్ నాయక్‌కు సంబంధించిన మొత్తం 11 ప్రాంతాలలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ మియాపూర్‌ లోని ఒక విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లా నంబర్-98లో ఏసీబీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విల్లాలోకి అధికారుల అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు.

సోదాల సందర్భంగా మోహన్ నాయక్ నివాసంలో లభించిన అక్రమార్జన చిట్టా చూసి ఏసీబీ అధికారులు సైతం అవాక్కయినట్లు సమాచారం. ప్రాథమిక తనిఖీల్లోనే భారీ ఎత్తున నగదు, బంగారం, విదేశీ మద్యం బాటిళ్లను అధికారులు గుర్తించారు. లెక్కల్లో చూపని దాదాపు రూ.60 లక్షల నగదు, 10 తులాల గోల్డ్ బిస్కెట్లతో పాటు సుమారు 3 కిలోల వరకు బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములు, ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 35 విదేశీ మద్యం సీసాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

టెండర్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు..
గతంలో స్టేట్ రోడ్స్ చీఫ్ ఇంజినీర్‌గా, ఆర్డీసీ (రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఎండీగా పనిచేసిన మోహన్ నాయక్‌కు ప్రభుత్వం గత సెప్టెంబరులోనే ఈఎన్‌సీగా పదోన్నతి కల్పించింది. అయితే బాధ్యతలు చేపట్టిన ఏడాది తిరగకముందే ఆయనపై భారీ అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం. రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమీషన్ల రూపంలో భారీగా డబ్బు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఏసీబీ ఈ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో స్వాధీనం చేసుకున్న అక్రమాస్తుల పూర్తి స్థాయి విలువపై సాయంత్రానికి స్పష్టత రానుంది. తనిఖీలు ముగిసిన అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలను ఏసీబీ వెల్లడించనుంది.

Exit mobile version