లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్

నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అష్టకష్టాలు పడుతుంది. ఈ నెల 10 న వస్తుందని అంత అనుకున్నారు కానీ అదే రోజు నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదికగా విడుదల అవుతుండడం తో వాయిదా వేశారు. ఈ నెల 24 న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసిన చిత్ర యూనిట్..ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ట్రైలర్ విడుదల చేసి ఆసక్తి నింపారు.

తెలంగాణ యాసలో చైతూ, సాయి పల్లవి ఆకట్టుకున్నారు. బిజినెస్ చేయాలనుకునే ఆలోచనలో చైతూ పడ్డ కష్టాలను చూపించారు. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇబ్బందులు సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్సర్ గా కనిపించబోతుంది. ట్రైలర్ లో చైతు సాయి పల్లవి మధ్య డైలాగులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా ట్రైలర్ లో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ …మరియు లోకేషన్స్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.