లోకేష్ పాదయాత్రలో అపశృతి…నందమూరి తారకరత్న కు గుండెపోటు


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఈరోజు ఉదయం కుప్పం స‌మీపంలోని శ్రీవ‌ర‌ద‌రాజ స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం ప్రారంభ‌మైంది. ఈ యాత్రలో సినీనటుడు నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు. కాగా యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే తారకరత్న వున్నట్లుండి స్పృహతప్పి పడిపోయారు…తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను హుటాహుటిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు.

అయితే తారకరత్నని ఆస్పత్రికి తీసుకొచ్చేరికి అసలు పల్స్ కూడా లేదని..అంతేకాదు అయన శరీరం మొత్తం కూడా నీలం రంగుగా మారింది అని వైద్యులు తెలిపారు. వెంటనే సీపీఆర్ చేయడంతో 45 నిమిషాల త‌ర్వాత ప‌ల్స్ మొద‌లైంద‌న్నారు. ఆపై కుటుంబ సభ్యుల కోరిక మేరకు కుప్పం పీఈఎస్ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

ఇక కుప్పం పీఈఎస్ వైద్యకళాశాలలో ఆయనకు యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు.. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. కాకపోతే ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. అంతేకాదు మెరుగైన చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగుళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ కూడా తార‌క‌ర‌త్న చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి చేరుకున్నారు. ఆయ‌న ఆరోగ్యంపై డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. తార‌క‌ర‌త్న ఆరోగ్యంపై నంద‌మూరి కుటుంబ స‌భ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.