రియల్ హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

చాలామంది తెరపై హీరో అనిపించుకునే..సోనూసూద్ మాత్రం తేరా వెనుక రియల్ హీరో అనిపించుకోవడమే కాదు కనిపించే దేవుడయ్యాడు. కరోనా కల్లోల సమయంలో ఎంతోమందిని సోనూ ఆదుకున్న తీరు చూసి, తెరపై ఆయనను చూసి జడుసుకున్నవారే పులకించి పోతూ అభినందనలు తెలుపుతున్నారు. తనకున్న పరిధిలో సోనూ సూద్ అనితరసాధ్యంగా సాయం అందించడంపై అందరూ ఆయన కరుణరస హృదయానికి జేజేలు పలుకుతున్నారు. ‘తెరపై విలన్… రియల్ లైఫ్ హీరో…’ అంటూ కితాబు నిస్తున్నారు. అలాంటి రియల్ హీరో ఈరోజు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నారు.

సోనూ సూద్ పంజాబ్ లోని మోగా అనే పట్టణంలో జన్మించాడు. తల్లిదండ్రులు శక్తి సాగర్ సూద్, సరోజ్ సూద్. సోను సూద్ నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. ఒక నెలరోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1996 లో మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన మహిళ సోనాలిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

1999 లో కుళ్ళళలగర్ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు. తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించాడు. 2000 లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించాడు. కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేది. 2002 లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. ణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ లో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. తరువాత నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం లభించింది.