The Family Man 3 : ప్రముఖ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ లో నటించిన రోహిత్ బస్ఫోర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆదివారం అస్సాంలోని ఓ జలపాతం వద్ద ఆయన మృతదేహం కనిపించింది. రోహిత్ ఇటీవల ముంబయి నుంచి గౌహతికి వచ్చి, స్నేహితులతో విహారయాత్రకు వెళ్లాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్‌ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గాలింపు ప్రారంభించిన పోలీసులు జలపాతం వద్ద రోహిత్ మృతదేహాన్ని వెలికితీశారు. శరీరంపై తల, ముఖం, ఇతర భాగాల్లో గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఇది ప్రమాదం కాదని, హత్యేనని ఆరోపిస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని పోలీసులు భావించినా, కుటుంబ సభ్యుల ఆరోపణలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ బస్ఫోర్ ఇటీవల పార్కింగ్ వివాదం నేపథ్యంలో రంజిత్, అశోక్, ధరమ్ బస్ఫోర్‌లతో గొడవపడ్డట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే జిమ్ యజమాని అమర్‌దీప్ విహారయాత్రకు రోహిత్‌ను పిలిచినట్టు తెలుస్తుండటంతో, అతనిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నలుగురు నిందితులు పరారీలో ఉండగా, పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక పోస్టుమార్టం నివేదికలో తల, ముఖం సహా శరీరంలోని పలుచోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.