వారిసు ట్రైలర్ : ఎన్నో తెలుగు హిట్ సినిమాల టెంప్లెట్ చూసినట్లు ఉంది…


అనగనగా ఒక పెద్ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ రన్ చేసే ఒక బిజినెస్… దాన్ని కబ్జా చెయ్యాలని చూసే ఒక విలన్. జాయింట్ ఫ్యామిలీలోని ఒక కుర్రాడు వచ్చి తన బిజినెస్ ని విలన్ చేతికి వెళ్ళకుండా, తన ఫ్యామిలీ ముక్కలు కాకుండా ఎలా కాపాడుకున్నాడు… అనే కథతో తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అన్నయ్య, పెద్దన్నయ్య, సంక్రాంతి, లక్ష్మీ ఇలా చెప్పుకుంటూ ఎన్నో సినిమాలు ఈ టెంప్లెట్ లో తెరకెక్కినవే. ఇదే లైన్ తో తెలుగు తమిళ భాషల్లో రూపొందిన సినిమా ‘వారిసు/వారసుడు’. దళపతి విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. జనవరి 12న సినీ అభిమానుల ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ పై విజయ్ ఫాన్స్ లో భారి అంచనాలు ఉన్నాయి కానీ నిజానికి ట్రైలర్ అంచనాలని రీచ్ అవ్వలేదు. ఇదేంటి టెంప్లెట్ సినిమాని తీసారు అని వారిసు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ అనిపించడం గ్యారెంటీ.

మొదట్లో చెప్పినట్లు ఒక ఉమ్మడి కుటుంబం రన్ చేస్తున్న బిజినెస్ కి శరత్ కుమార్ హెడ్, ఆయన భార్య జయసుధ, కొడుకులు ముగ్గురు. ఒకరు శ్రీకాంత్, ఇంకొకరు కిక్ శ్యాం, మూడో అతను విజయ్. శరత్ కుమార్ రన్ చేసే బిజినెస్ ని ప్రకాష్ రాజ్ కొట్టెయ్యాలి అనుకుంటే ‘విజయ్’ అడ్డుపడి దాన్ని ప్రకాష్ రాజ్ నుంచి ఎలా కాపాడుకున్నాడు అనేది వారిసు సినిమా కథ. ఈ కథతో చాలా సినిమాలు వచ్చాయి కాబట్టి మేకింగ్ లో హెవీ స్టాండర్డ్స్ ని, ఫైట్స్ లో యాక్షన్ డోస్ ని, డైలాగ్స్ లో పంచులని పెడితే సరిపోతుందని మేకర్స్ భావించినట్లు ఉన్నారు. విజయ్ డైలాగ్ చెప్తే అది పంచ్ అవ్వాల్సిందే అనేలా రాసిన డైలాగ్స్ ట్రైలర్ లో బాగానే పేలాయి, రష్మిక ట్రైలర్ లో కనిపించింది చాలా తక్కువే. సినిమాలో కూడా అంతే ఉంటే కోలీవుడ్ లో పాగా వెయ్యాలని ప్లాన్ చేస్తున్న రష్మికకి గట్టి దెబ్బ పడినట్లే. తమన్ ఇచ్చిన మ్యూజిక్ ట్రైలర్ లో బాగుంది కానీ ట్రైలర్ కట్ చేసిన విధానమే బాగోలేదు. ఎదో పాత సినిమా ట్రైలర్ ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఫ్యామిలీ, హీరో ఇంట్రో, సాంగ్, విలన్ ఇంట్రో, హీరోయిజం, ఫ్యామిలీ, హీరో హీరోయిన్ సాంగ్, యాక్షన్ ఎపిసోడ్, పంచ్ డైలాగ్… ఇలా కొలత చూసుకోని ట్రైలర్ ని కట్ చేసినట్లు ఉన్నారు. మరి వారిసు సినిమాలో ఏమైనా అద్భుతాలు ఉన్నాయేమో కానీ ట్రైలర్ లో మాత్రం ఎలాంటి అద్భుతాలు లేవు.