విరాట పర్వం టాక్

‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’ డైరెక్షన్లో రానా – సాయి పల్లవి జంటగా విరాటపర్వం సినిమా తెరకెక్కింది. స్వచ్చమైన ప్రేమకథకు నక్సలైట్ ఉద్యమాన్ని జోడించి తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులు ఏమంటున్నారు..? సినిమా హైలైట్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం.

కథ ఏంటి అంటే..విరాటపర్వం కథ 1990వ ప్రాంతంలో జరుగుతుంది. వెన్నెల (సాయి పల్లవి) కామ్రెడ్ అరణ్య అలియాస్ రవన్న (రానా) రచనలకు ప్రభావితం అవుతుంది. ప్రేమను పెంచుకుంటుంది. కృష్టుడిపై మీరాబాయ్ పెంచుకున్న ప్రేమలా అరణ్య మీద వెన్నెల ప్రేమను పెంచుకుంటుంది. అయితే దళనాయకుడైన రవన్నను పట్టుకునేందుకు పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తుంటారు. అలాంటి సమయంలోనే వెన్నెల కూడా ఇళ్లు వదిలి రవన్న కోసం ఊరురా తిరుగుతుంది. రవన్న చేరుకునేందుకు పడరాని కష్టాలు పడుతుంది. చివరకు దళంలో చేరుతుంది. అయితే ఆ సమయంలోనే దళంలో కోవర్టులున్నారని తెలుస్తుంది. చివరకు వెన్నెల మీద అనుమానం వస్తుంది. వెన్నెలను దళసభ్యులే అంతం చేస్తారు. అదే విరాటపర్వం కథ..

హైలైట్స్ :

వెన్నెల పాత్ర లో సాయి పల్లవి వన్ ఉమెన్ షోగా తన ఫెర్మార్మెన్స్‌ను పండించింది. వెన్నెల పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందా అనే ఫీలింగ్‌ను కల్పిస్తుంది. తల్లిదండ్రులతో సీన్లు గానీ.. పౌర హక్కుల సంఘం ఇంటిలో జరిగిన సంభాషణ తర్వాత సాయిపల్లవి ఫైర్ బ్రాండ్‌గా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో రానా తన తల్లిని కలిసిన సన్నివేశం గుండెను పిండేసేలా ఉంటుంది. దాదాపు 25 నిమిషాలపాటు సాయిపల్లవి తన నటనతో మ్యాజిక్ చేసిందనే చెప్పాలి.

రవన్నగా రానా దగ్గుబాటి పాత్ర పెద్దగా ప్రభావితం చేయలేకపోయిందనే చెప్పాలి. రానా గెటప్ గానీ.. తన ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ గానీ అంతగా ఆకట్టుకొలేకపోయాయని చెప్పవచ్చు. గతంలో రానాలో ఉండే ఫైర్ రవన్న పాత్రలో ఎక్కడా కనిపించలేదని చెప్పవచ్చు. మిగతా పాత్రలోని నటి నటులు వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

డైరెక్టర్ వేణు..సన్నివేశాలకు అనుగుణంగా రాసుకొన్న డైలాగ్స్.. తెలంగాణ ప్రాంతంలోని ఆచారాలు, సంప్రదాయాలు, భాషను అత్యంత సహజసిద్దంగా, సున్నితమైన విధానంలో తెరపైకి తీసుకు రావడంలో సఫలమయ్యారు. అత్యంత వివాదాస్పద అంశాలను కూడా మెప్పించే విధంగా కథను రాసుకోవడం మరింత పాజిటివ్‌గా మారింది. చివరి 20 నిమిషాల్లో వేణు నడిపిన డ్రామానే విరాట పర్వం సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు.

ఓవరాల్ గా సినిమా చూసిన ఆడియన్స్ పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అంటున్నారు. రివ్యూస్ సైతం సినిమా హిట్ ను చెపుతున్నారు.