ఎయిరిండియా విమానంలో ప్రసవించిన మహిళ

లండన్‌ నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఆకాశమార్గంలో కొద్దిసేపు ఉద్వేగపూరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో ఓ మహిళకు ప్రసవ నొప్పులు మొదలుకావడమే ఇందుక్కారణం. విమానంలో 204 మంది ప్రయాణిస్తుండగా వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉన్నారు. వీరు వెంటనే ఆ మహిళకు వైద్యం చేయడంతో నెలలు నిండని ప్రసవం సుఖాంతమైంది. ఆమెకు వైద్య పర్యవేక్షణ అవసరం కావడంతో మార్గమధ్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని దించి, తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. మరో ప్యాసింజరు వీరికి తోడుగా ఉన్నారు. మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి కోచికి బయలుదేరింది. మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఆ ముగ్గురినీ తర్వాత ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి భారత్‌కు తీసుకువస్తామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.