పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం


పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశాన్ని అన్ని రంగాల్లో దెబ్బతీస్తున్నాయి. తాజాగా పాక్ క్రికెటర్ల యూట్యూబ్ ఛానెళ్లను భారత్‌లో నిషేధిస్తూ మోడీ ప్రభుత్వం మరో గట్టి దెబ్బ ఇచ్చింది. షోయబ్ అక్తర్, అర్జూ కజ్మీ, సయ్యద్ ముజమ్మిల్ షా వంటి ప్రముఖులతో పాటు, డాన్ న్యూస్, సమ్మా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్, జీఎన్ఎన్, బోల్ న్యూస్ వంటి పాక్ మీడియా ఛానెల్స్‌ కూడా నిషేధానికి గురయ్యాయి. పహల్గామ్ దాడిని ఖండించకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. భారత ప్రభుత్వం పాక్ డిజిటల్ ప్లాట్‌ఫాంలపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.

ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయి. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యమిచ్చినా, భారత్ హైబ్రిడ్ మోడల్ ద్వారా మాత్రమే ఆడటానికి అంగీకరించింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడడంతో పాకిస్థాన్ తన హోస్ట్ హక్కులూ కోల్పోయింది. ఇక లీగ్ పోటీల విషయానికి వస్తే, బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ ప్రపంచ ప్రఖ్యాతి పొందగా, పిసిబి మాత్రం తమ ఆటగాళ్లకు హెయిర్ డ్రయ్యర్‌లు, ట్రిమ్మర్‌లు బహుమతిగా ఇవ్వడం గర్వంగా చాటుకుంటోంది. ఇలా ప్రతిసారీ భారత్ ముందు పాక్ పరువు పోగొట్టుకుంటూనే ఉంది.