ఢిల్లీ, హ‌ర్యానాలో ఐదు మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను నెల‌కొల్ప‌నున్న డిఆర్‌డిఒ

కోవిడ్‌-19 కేసుల, త‌ద‌నంత‌ర ఆక్సిజ‌న్ అవ‌స‌రాల పెరుగుద‌ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు దేశ‌వ్యాప్తంగా 500 మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసేందుకు పిఎం -కేర్స్ నిధుల‌ను కేటాయించింది. ఈ ప్లాంట్ల‌ను మూడు నెల‌ల్లో నెల‌కొల్ప‌నున్నారు. మే తొలివారంలో ఢిల్లీలో, చుట్టుప‌క్క‌ల త‌న ప‌రిశ్ర‌మ‌ల ద్వారా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డిఆర్‌డిఒ) ఐదు మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిని ఎయిమ్స్ ట్రామా సెంట‌ర్‌, డాక్ట‌ర్ రామ్ మ‌నోహ‌ర్ లోహియా హాస్పిట‌ల్ (ఆర్ ఎంఎల్‌), స‌ఫ్ద‌ర్‌జంగ్ హాస్పిట‌ల్‌, లేడీ హార్డింగ్ మెడిక‌ల్ కాలేజీ, మ‌రొక‌టి హ‌ర్యానాలోని ఝ‌ఝ్ఝ‌ర్ లో గ‌ల ఎయిమ్స్‌లో నెల‌కొల్ప‌నున్నారు. షెడ్యూలు ప్ర‌కారం ఇందులో రెండు ప్లాంట్లు మే 4, 2021న ఢిల్లీ చేరుకున్నాయి. వీటిని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆసుప‌త్రుల‌లో నెల‌కొల్పుతున్నారు. డిఆర్‌డిఒకు సాంకేతిక భాగ‌స్వామి అయిన ఎం/ఎస‌్ ట్రైడెంట్ న్యుమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ స‌ర‌ఫ‌రా చేసింది. ఇదే సంస్థ‌కు 48 ప్లాంట్లకు ఆర్డ‌ర్‌ను ఇచ్చారు. ఎం/ఎ స్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టంస్ లిమిటెడ్‌కు 332 ప్లాంట్ల‌ను ఆర్డ‌ర్ ఇవ్వగా, వీటి స‌ర‌ఫ‌రా మే నెల మ‌ధ్య‌లో ప్రారంభం కానుంది. స‌మ‌యానికి ప్లాంట్ల‌ను అందించేందుకు వాటి స‌ర‌ఫ‌రా షెడ్యూల్‌ను స‌న్నిహితంగా స‌మీక్షిస్తున్నారు. స‌మాంత‌రంగా ప్ర‌తి ఆసుప‌త్రిలోనూ జాగాను సిద్ధం చేస్తున్నారు.

ఈ మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్లు నిమిషానికి 1,000 లీట‌ర్ల (ఎల్‌పిఎం) ఆక్సిజ‌న్ ప్ర‌వ‌హించేలా రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ వ్య‌వ‌స్థ 5 ఎల్‌పిఎంతో 190మంది రోగుల‌కు అందించ‌డ‌మే కాక 195 సిలెండ‌ర్ల‌ను నింప‌గ‌ల‌దు. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ప్లాంట్ (ఎంఒపి) సాంకేతిక‌త‌ను తేలిక‌పాటి యుద్ధ విమానం తేజ‌స్‌కు అక్క‌డిక‌క్క‌డ ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసే సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేశారు. ఈ ప్లాంట్లు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి, అత్య‌వ‌స‌ర స్థితిలో ఉన్న కోవిడ్‌-19 రోగుల‌కు తోడ్ప‌డ‌నుంది. త‌న ప‌రిశ్ర‌మ‌ల ద్వారా 120 ఎంఒపికి సిఎస్ఐఆర్ ఆర్డ‌ర్ చేసింది.