Site icon TeluguMirchi.com

పవన్ కు దూరమైన మరో సన్నిహితుడు ..

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నచ్చి ఆయనతో స్నేహం చేసిన వారంతా ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం మారిపోవడం తో ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఒకప్పుడు పవన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న శరత్ మరార్..అలీ వంటి వారు ఇప్పటికే దూరంగా కాగా..తాజాగా రాజు రవితేజ కూడా పవన్ కు గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ లో కీలక సభ్యుడిగా ..పవన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజు..పవన్ వ్యవహారం ప్రమాదకరంగా మారిందని..ఇక ఆయనతో నడవడం చాల ప్రమాదకరమని చెపుతూ పార్టీ కి రాజీనామా చేసారు.

‘పవన్ కళ్యాణ్ తో గానీ, జనసేన పార్టీతో గానీ ఇక నుంచి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఉండబోదని రాజు రవితేజ అన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని ఆయన కోరారు. పార్టీ భావజాలం, పార్టీ రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించానని అన్నారు. జనసేన పార్టీకి మొట్ట మొదటి ప్రధాన కార్యదర్శి తాను ఎన్నికయ్యానని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను పార్టీలో పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నానని చెప్పారు.

పవన్ కల్యాణ్ కోరిక మేరకు తాను ఈ పదవి ఇష్టం లేకపోయినప్పటికీ అంగీకరించానని అన్నారు. ఇక మీదట తాను పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయబోనని, ఆయనతో లేదా జనసేన పార్టీతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండట్లేదని అన్నారు. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు కక్షసాధింపు ధోరణి పెరిగిందని రాజు రవితేజ ఆరోపించారు. కులం, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదని ధ్వజమెత్తారు. అర్హత లేకుండా పొందినది, అనుమతి లేకుండా వెళ్లిపోతుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను జనసేన పార్టీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని అన్నారు.

రాజు రవితేజ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఆయన ఆవేదనను, అభిప్రాయాలను పార్టీ నాయకత్వం గౌరవిస్తోందని చెప్పారు. ఇదివరకు ఆయన ఇలాంటి బాధ, ఆవేదనతోనే రాజకీయాల్లోకి వచ్చారని, జనసేనలో కీలక నేతగా ఎదిగారని అన్నారు. ఆయనకు మంచి భవిష్యత్తు లభించాలని కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Exit mobile version