ఏపీలో పొలిటికల్ హీట్ …!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. 2024 లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.

గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార వైఎస్సార్సీపీ, వచ్చే ఎలక్షన్స్ లోనూ గెలుపు తమదే అని ధీమాగా ఉన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే మరోసారి అధికారం కట్టబెడతాయని నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈసారి 175కి 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా సాగుతున్నారు.

మరోవైపు గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈసారి తిరిగి అధికారం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సభలు ర్యాలీలతో తమ పార్టీకి ప్రజల మద్దతు ఉందని తెలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలానే ప్రభుత్వం వ్యతిరేకులను ఏకం చేసే దిశగా నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు.

ఇందులో భాగంగా జనసేన వంటి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవలి రాజకీయ పరిణామాలను బట్టి అర్ధవుతోంది. 2014 లో చంద్రబాబుకి మద్దతు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి 2024 లో టీడీపీతో కలిసి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది కాబట్టి, ఈ మధ్యలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఎవరు ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకుంటారనేది చూడాలి.