కరోనా కట్టడికోసం ఆ గ్రామం ఏంచేసిందంటే …

కోవిడ్-19ని కట్టడి చేయడానికి నాందేడ్ జిల్లాలోని భోసి గ్రామం వినూత్న మార్గాన్ని అనుసరించి విజయం సాధించి దేశంలో అందరికి మార్గదర్శకంగా నిలిచింది. దేశంలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ కోవిడ్-19 కొత్త సవాళ్లను విసిరింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వ్యాప్తిని నివారించడానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలను చైతన్యవంతులను చేసి పంచాయతీ రాజ్ సంస్థలు ముందుకు వచ్చి సహకరించాలని పిలుపు ఇచ్చారు. 

పట్టణ ప్రాంతాలతో పోల్చి చూస్తే వైద్య సౌకర్యాలు తక్కువగా కలిగి పరీక్షలను నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడం క్లిష్టంగా ఉంటుంది. ఈ సమయంలో నాందేడ్ జిల్లా భొకర్ తాలూకాలోని  భోసి గ్రామంలో అనుసరిస్తున్న విధానం అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. కోవిడ్ ని కట్టడి చేయడానికి ఏకాంతంగా జీవించడమే మార్గంగా ఈ గ్రామ ప్రజలు ఎంచుకున్నారు. 

రెండు నెలల కిందట గ్రామంలో వివాహ వేడుక జరిగిన తరువాత ఒక అమ్మాయికి వైరస్ సోకింది. వారం రోజుల తరువాత మరో అయిదుగురు వ్యక్తులకు వైరస్ సోకడంతో గ్రామంలో భయాందోళన పరిస్థితి ఏర్పడింది. దీనితో గ్రామ పంచాయతి, ఆరోగ్యశాఖ సహకారంతో జిల్లా పరిషత్ సభ్యుడు ప్రకాష్ దేశముఖ్ భోసికర్ వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి కోవిడ్ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ మరియు ఆర్టీ-పిసిఆర్ పరీక్షలలో 119 మంది కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది.

కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా చూడడానికి వైరస్ సోకినవారిని విడిగా ఉంచాలని నిర్ణయించారు. కొద్దిపాటి వైరస్ లక్షణాలు ఉన్నవారికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ  15 నుంచి 17 రోజులు విడిగా ( ఐసొలేషన్) జీవించాలని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా గ్రామంలో వైరస్ సోకినవారు తమ పొలాల్లో ఉండేలా ఒప్పించడం జరిగింది. పొలాలు లేని కూలీలు ఇతరులు ఉండడానికి భోసికార్ తన సొంత  పొలంలో 40 ’x 60’ షెడ్లను ఏర్పాటు చేశారు.

గ్రామ ఆరోగ్య కార్యకర్త ఆశటాయ్, అంగన్వాడి సేవిక ప్రతిరోజూ పొలాలను సందర్శించి రోగులతో మాట్లాడి వారికి  అక్కడికక్కడే ఆహారం, మందులు కూడా అందించారు. దీనికి దాదాపు అందరూ సహకరించారు. 15 నుంచి  20 రోజుల ఐసొలేషన్  తరువాత  గ్రామస్తులు ఆరోగ్యంగా ఇళ్లకు తిరిగి వచ్చారు. ఆరోగ్య పరీక్షల్లో వీరికి కరోనా లేదని తేలింది. ఇది జరిగి 45 రోజులు అయ్యిందని ఇంతవరకు కొత్తగా ఎవరికి కరోనా సోకలేదని భోసికర్ తెలిపారు.