ఎన్‌వైకెఎస్‌ ఆధ్వర్యంలో చార్మినార్ లో ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమం

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్ర సంస్థ (ఎన్.వై.కె.ఎస్) ‘క్లీన్ ఇండియా’ ప్రచారంలో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌వైకెఎస్‌, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చారిత్రక కట్టడమైన చార్మినార్ పరిసర ప్రాంతాల నుండి వ్యర్థ ప్లాస్టిక్ పదార్థాలను సేకరించారు.

ఈ సందర్భంగా ఎన్.వై.కె.ఎస్ ప్రాంతీయ సంచాలకులు శ్రీ సత్య ప్రకాశ్ పట్నాయక్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఎన్‌వైకెఎస్‌, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తెలంగాణాలోని పలు జిల్లాల్లో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియ జేశారు.

ఈ ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమంలో భాగస్వాములైన యువ కార్యకర్తలతో జిల్లా యూత్ అధికారి కుష్బు గుప్తా స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు.

భారత స్వాతంత్య్ర 75 సంవత్సరాల స్మారకార్థం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. సుమారు 744 జిల్లాలలో 6 లక్షల గ్రామాలలో 2.5 లక్షల యువ కార్యకర్తలు ఈ ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమంలో భాగం అవుతున్నట్లు ఎన్.వై.కె.ఎస్ రాష్ట్ర సంచాలకులు శ్రీ అంశుమన్ ప్రసాద్ దాస్ అన్నారు.

జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ శ్రీ సూర్య కుమార్, చార్మినార్ కార్పొరేటర్ శ్రీ సోహైల్ ఖాద్రీ, జిహెచ్ఎంసి డిఇఇ శ్రీ ఎ. శ్రీనివాస్, సెట్విన్ డైరెక్టర్ శ్రీ వేణుగోపాల్ ఈ కార్యక్రమానికి అతిథులుగా పాల్గొన్నారు. ఎన్.వై.కె.ఎస్, ఎన్ఎస్ఎస్ అధికారులు, సుమారు 150 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.