తెలంగాణ లో కరోనా టీకాల కొరత

తెలంగాణ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో జనం టీకాల కోసం క్యూలు కడుతున్నారు. మొదట్లో అయిష్టత చూపిన కొందరు వైద్య సిబ్బంది కూడా టీకా కోసం ముందుకు వస్తున్నారు. దీంతో కరోనా టీకాలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పుడు రాష్ట్రంలో రోజూ లక్షన్నర మందికిపైగా కరోనా టీకాలు వేస్తున్నారు. ఈ సంఖ్యను పెంచేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ లెక్కన 2 రోజులు ఓకేనని ఆలోపు కేంద్రం టీకాలను సరఫరా చేయకపోతే..తర్వాతి రోజు నుంచి టీకా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయక తప్పదని అధికారులు అంటున్నారు.

సర్కారు కరోనా వ్యాక్సినేషన్‌ పెంచేందుకు అన్ని ఏర్పా ట్లుచేసినా.. టీకాలు లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. పైగా రెండో డోస్‌ టీకా కోసం ఇప్పటికే గడువు సమీపించిన లబ్దిదారుల్లో ఆందోళన కనిపిస్తోంది. రాష్ట్రానికి ఇప్పటివరకు 26.78 లక్షల వరకు కరోనా వ్యాక్సిన్లు వచ్చాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట వైద్య సిబ్బందికి, తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన అందరికీ టీకా వేస్తున్నారు.