ఓయూలో కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన ఏబివిపి కార్యకర్తలు

రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలకు త్వరిత గతిన ఉద్యోగ ప్రకటనలివ్వాలని, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ABVP ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్లో కీలకాంశమైన ఉద్యోగాల నియామకాలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం, స్వరాష్ట్రంలో గత 7 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ మోసపూరిత ప్రకటనలు త్వరలో ఉద్యోగాలు భర్తీ అన్న వార్తలు వినీవినీ నిరుద్యోగులు తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనలు చేయడం పరిపాటైపోయింది. సగటు తెలంగాణ నిరుద్యోగి ఆశలన్నీ వదిలేసుకొని, ప్రభుత్వాన్ని నమ్మలేని స్థితితో ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన ప్రారంభంలో 1,07,000 ఉద్యోగ ఖాళీలుంటే నేడు 2 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలుండడం గమనార్హం.

సీ ఆర్ బిస్వాల్ (పీ ఆర్ సీ ) కమిటీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 31 శాఖల్లో 4,91,304 ఉద్యోగాలకుగానూ 3,00,178 ఉద్యోగులు పనిచేస్తుండగా 1,91,126 ఉద్యోగ ఖాళీలున్నాయి. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 5 కీలక శాఖలైన వైద్య, ఆరోగ్య శాఖలో 30,570 పాఠశాల విద్యలో 23,798 పోలీసు శాఖలో 37,182 పంచాయితీ శాఖలో 12,628 రెవిన్యూ శాఖలో 7,961 ఖాళీలున్నాయి. 2015 లో 1,642 డిగ్రీ లెక్చరర్ పోస్టులు అనుమతించిన నేటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఉద్యోగ భర్తీ లో జాప్యం వల్ల పేద విద్యార్థులు నాణ్యమైన ఉన్నత విద్యకు దూరమౌతున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్,టిఎస్పిఎస్సి వెబ్ సైట్ లో సుమారు 25 నుండి 30 లక్షల వరకు నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రూప్-1 పోస్టులకు 2011లో ,జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2008లో ,డిగ్రీ లెక్చరర్ పోస్టులకు 2013లో, గ్రూప్-డి పోస్టులకు 2016లో చివరిసారిగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి.ఒక TSPSC చేపట్టిన 36 వేల పైచిలుకు ఉద్యోగాల్లో మెజారిటీ శాతం టెక్నికల్ కు సంబంధించినవే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61 ఏండ్లకు పెంచి యువత ఆశలపై నీళ్లు చల్లింది.తెలంగాణ వచ్చాక బోర్డులపై రాతలు మారాయి తప్ప నిరుద్యోగుల తలరాతలు మారలేదు. కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఏర్పడటంతో భారీగా ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. సంవత్సరాలు గడిచినా నోటిఫికేషన్ రాకపోవడంతో అనేక మంది నిరుద్యోగులు ఆర్థికంగా సామాజికంగా ఎంతో మానసిక వేదనను అనుభవిస్తూ కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనల జారీలో తీవ్ర జాప్యం అవుతుండడం వల్ల నిరుద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది. 2018 నుండి ఇప్పటి వరకు టీఎస్ పీ ఎస్సీ ప్రకటనలు నిలిచిపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ బిశ్వాల్ కమిటీ ప్రకారం రాష్ట్రంలో 1.91,126 లక్షల ఉద్యోగ ఖాళీలున్నా నోటిఫికేషన్ విడుదల చేయకుండా, స్వయంగా ముఖ్యమంత్రి 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా కనీసం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అనేక మంది నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లుగా చదువుతూ ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు.రాష్ట్రంలో నిరుద్యోగులు సుదీర్గంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ఖాళీలకు వెంటనే నోటిఫికెషన్స్ విడుదల చేసి ప్రభుత్వ బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న 1,91,126 ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయాలి. వివాదాస్పద నోటిఫికేషన్ ల విషయంలో కోర్ట్ జోక్యంతో జాప్యమైన గత అనుభవాల దృష్ట్యా వివాదాల్లేని నోటిఫికేషన్స్ విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా UPSC నియామకాల తరహాలో TSPSC ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి, 1.91 లక్షల ఖాళీలను వెనువెంటనే త్వరితగతిన పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో 7 సంవత్సరాలుగా అధ్యాపక పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ లోనే 858 కి పైగా అధ్యాపకుల ఖాళీలతో, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో 2152 ఖాళీలు, వేలల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ABVP రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీశైలం వీరమల్ల, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీవన్ కుమార్, ఎల్లస్వామి, శివ, మహేష్, కోస్గి మహేష్, శ్రీధర్, సాయి తదితరులు పాల్గొన్నారు.