మహేష్ బాబులా ట్రై చేసాడు, కానీ చివరకు ఇలా …

ఓ మహిళను మోసం చేసిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా… నిందితుడు అతడు సినిమాలో మహేష్ బాబు లా ట్రై చేసి ఐదంతస్థుల భవనం మీదనుండి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

ఆసిఫ్​నగర్​కు చెందిన కలీముద్దీన్ దుండిగల్​కి చెందిన ఓ మహిళను దుబాయ్​కి పంపిస్తానని నమ్మించాడు. ఆమె దగ్గరనుంచి రూ. లక్షా 30 వేలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్న తర్వాత ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్ కి వచ్చి విచారణకు హాజరు కావాలని కలీముద్దీన్ కి సూచించారు. కలీముద్దీన్ మాత్రం పోలీస్ స్టేషన్ కి వెళ్లలేదు. దీంతో పోలీసులే ఆసిఫ్ నగర్ లోని కలీముద్దీన్ ఇంటికి వెళ్లారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఐదో అంతస్తు నుంచి కిందకు దూకాడు. కిందికి వచ్చి చూసేసరికి తీవ్రంగా గాయపడి.. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కలీముద్దీన్ ను కుటుంబ సభ్యులు మహవీర్ హాస్పిటల్ కి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు, కలీముద్దీన్ అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానాకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆసిఫ్ నగర్ ఇన్ స్పెక్టర్ రవీందర్ తెలిపారు.