సొంత డబ్బుతో గ్రామాభివృద్ది చేస్తున్న రంగినేని కుటుంబం

నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలం, జూపల్లి గ్రామంలో ఆదివారం (అక్టోబర్ 10) నూతనంగా పశువైద్యశాల ప్రారంభమైయింది. గ్రామానికి చెందిన రంగినేని శ్యామసుందర్, రంగినేని హనుమంతరావులు తమ సొంత నిధులు 80 లక్షల రూపాయిలతో హనుమంత రావు గారి తాతగారైన రంగినేని భగవంత రావు జ్ఞాపకార్ధం పశు వైద్యశాలని నిర్మించారు. పశు వైద్యశాలతో పాటు పశు వైద్యుని వసతి గృహం, పీర్ల చావిడి, పాలకేంద్రం, గ్రంధాలయం ఏర్పాటు చేశారు. స్వగ్రామంపై వున్న అభిమానం, వ్యవసాయం పట్ల మక్కువతో పాటు గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ కోరడంతో.. గ్రామ అవసరాలని గుర్తించి తమ సొంత నిధులతో నిర్మాణాలు చేపట్టారు.

ప్రారంభోత్సవం సందర్భంగా రంగినేని శ్యామసుందర్ రావు మాట్లాడతూ.. గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ కోరడంతో పశు వైద్యశాలతో పాటు వైద్యుడు ఉండటానికి ఒక రెషిడెన్స్, పిల్లలు చదువుకోవడానికి ఒక గ్రంధాలయం నిర్మాణం చేపట్టామని, గ్రామం, గ్రామ ప్రజలు, వ్యవసాయంపై వున్న మక్కువ తామీ కార్యక్రమాలు చేపట్టానని, ఖర్చులు గురించి అలోచించలేదని, తమ శక్తి మేరకు భవిష్యత్ లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

రంగినేని హనుమంతరావు మాట్లాడుతూ… సొంత గ్రామానికి సేవ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, వెటర్నరీ హాస్పిటల్ తో పాటు ఒక డంపింగ్ యార్డ్, రైతు వేదికకి 600 గజాల స్థలం ఇవ్వడం జరిగిందని, భవిష్యత్ లో మరి కొన్ని కార్యక్రమాలు కూడా చేపడతామని, తమ శక్తి మేరకు గ్రామ అభివృద్ధికి కోసం కృషి చేస్తాం” అని వెల్లడించారు.

ప్రారంభోత్సవం సందర్భంగా సబ్బండ కులాల పెద్దలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దలకు శాలువాలు కప్పి సత్కారించారు. ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త, వ్యవసాయ నిపుణులు డా.మొరుపోజు పద్మయ్య, ప్రో. విమల కటికనేని పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్దఎత్తున ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. తాము కోరిన వెంటనే ఖర్చుకు వెనకాడకుండా పశు వైద్యశాలతో పాటు వసతి గృహం, పీర్ల చావిడి, పాలకేంద్రం, గ్రంధాలయం ఏర్పాటు చేయడంపై జూపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.