కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నా : పవన్ కళ్యాణ్


ఇవాళ జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ఏర్పాటు చేసిన జనసేన తెలంగాణ కార్యనిర్వాహకుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడారు. బీజేపీతో పొత్తు కొనసాగుతోందని, కమలనాథులతో ఇప్పుడు కలిసే ఉన్నామన్నారు. తెలంగాణలో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమని ఆయన అన్నారు. మన పార్టీ భావజాలానికి దగ్గరగా వస్తేనే తాము పొత్తుకు సిద్ధమని ఆయన అన్నారు. అంతేకాదు తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిన నేల అని.. తన రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలు పెట్టానని పవన్ స్పష్టం చేసారు.

అలాగే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిమిత సంఖ్యలోనే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాలు, 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో పాలన బాగుందని అన్నారు. అలాగే రెండు రాష్ట్రాల సమస్యలు వేర్వేరని… రెండింటినీ పోల్చలేమని అన్నారు.

ఆంధ్రాలో కులాల గీతల మధ్యలో రాజకీయం చేయాల్సి వస్తోందని పవన్‌ అన్నారు. ఆ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను ఇష్టానుసారంగా తిట్టేవాళ్లు ఉన్నారని అన్నారు. పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడేవాళ్లని తెలిపారు. ఏపీలో తాను ఏం సాధించినా అది తెలంగాణ స్ఫూర్తితోనే అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అంతకుముందు ఆయన కొండగట్టు ఆంజనేయస్వామి గుడిలో వారాహి ప్రచార రథం పూజలు నిర్వహించారు.