Pawan Kalyan : హిందీపై వైఖరి మార్చిన పవన్ కళ్యాణ్.. “మన భాష అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ”

 

Pawan kalyan
హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో జరిగిన కేంద్ర రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హిందీ భాషను వ్యతిరేకించడంలో అర్థం లేదని, దానిని అభివృద్ధికి దోహదపడే సాధనంగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

హిందీ భాషను “పెద్దమ్మ” భాషగా పేర్కొంటూ, “మన మాతృభాష అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ వంటిదే. దేశమంతటా మాట్లాడే హిందీ భాషను నేర్చుకోవడం వల్ల మన సామర్థ్యం పెరుగుతుంది, దేశవ్యాప్తంగా సంభాషణకు మాధ్యమం అవుతుంది” అని పవన్ వ్యాఖ్యానించారు.

ఆంగ్ల భాష మనకు ఐటీ రంగంలో గేటు తెరిచినట్లే, హిందీ భాష కూడా దేశవ్యాప్తంగా ఉపాధి, వ్యాపార అవకాశాలకు ద్వారంగా మారుతుందని పవన్ చెప్పారు. దక్షిణ భారత సినిమాల ఆదాయంలో హిందీ డబ్బింగ్‌కి 31 శాతం వాటా ఉండటం ద్వారా ఆ భాషలోని ప్రాచుర్యం స్పష్టమవుతుందని చెప్పారు. ‘‘వ్యాపార ప్రయోజనాల కోసం హిందీ అవసరమైతే, నేర్చుకోవడంలో ఇబ్బంది ఏమిటి?’’ అని ప్రశ్నించారు.

తన చిత్రం “ఏ మేరా జహా” లో హిందీ పాటను ఉద్దేశపూర్వకంగా చేర్చిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. “తెలుగు నా మాతృభాష అయినా, హిందీ దేశభాష అనే అర్థం ప్రజలకు బోధించేందుకే ఆ పాటను వినిపించాను,” అని తెలిపారు.

పవన్ దేశ భిన్నతలో ఏకతను హైలైట్ చేస్తూ పలు రాష్ట్రాల నేతల పాత్రను ప్రస్తావించారు. బెంగాల్, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన మహనీయుల దేశ సేవను గుర్తు చేస్తూ, భారతదేశంలో భాషా వైవిధ్యం ఉన్నా – ఒక భాషా ఆధారంగా దేశం ముందుకు పోవాలంటే హిందీయే మార్గమని అభిప్రాయపడ్డారు. “ప్రతి భాష జీవ భాషే. కానీ దేశాన్ని కలిపే భాష హిందీయే,” అని స్పష్టం చేశారు.

గతంలో హిందీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు హిందీని దేశ ఐక్యతకు ప్రతీకగా అభివర్ణించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో కొత్త చర్చలకు తెరతీసింది.