Mayasabha Web Series Review : ‘మయసభ’ వెబ్ సిరీస్ రివ్యూ

Mayasabha review

 

Sonyliv original web series Mayasabha review rating in Telugu: సోనీలివ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ మయసభతో దర్శకుడు దేవాకట్టా మళ్లీ రాజకీయ డ్రామా జానర్‌లో తన ముద్ర వేశాడు. కిరణ్ జయ్ కుమార్ సహ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, తాన్య రవిచంద్రన్, దివ్యా దత్తా కీలక పాత్రల్లో నటించారు. ఈ కథ పూర్తిగా కల్పితం అని మేకర్స్ చెబుతున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి – చంద్రబాబు నాయుడు లాంటి నాయకుల ప్రభావం కనిపించకుండా ఉండదు.

కథ ఏమిటి?
కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి) సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. రాజకీయాలపై ఆసక్తి, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నప్పటికీ కుటుంబ మద్దతు ఉండదు. మరోవైపు రామిరెడ్డి (చైతన్య రావు) వైద్యుడు. అతని తండ్రి బాంబుల శివారెడ్డి (శంకర్ మహంతి) రాయలసీమలో కఠినంగా వ్యవహరించే వ్యక్తి. ఈ ఇద్దరి స్నేహం, వారి రాజకీయ ప్రయాణం, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిన ఐరావతి బసు (దివ్యా దత్తా) నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు కథకు ప్రధానంగా నిలుస్తాయి. రాయపాటి చక్రధర్ రావు (సాయి కుమార్) ఎంట్రీతో కథ మరింత ఉత్కంఠ రేపుతుంది.

Also Read :  Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. 'పెద్ది' కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!

విశ్లేషణ
సిరీస్ చూస్తున్నంతసేపు కల్పిత పాత్రల వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యక్తుల ప్రతిబింబం కనిపిస్తుంది. దేవాకట్టా ఎవర్నీ ఎక్కువ చేయకుండా, ఎవర్నీ తక్కువ చేయకుండా కథనం నడిపించారు. ముఖ్యంగా కులవ్యవస్థపై ఆయన చూపించిన దృక్పథం బలంగా ఉంటుంది. “ఈ దేశంలో పుట్టిన ప్రతివాడి వెనుక కులం ఒక బలం” లాంటి డైలాగులు సీరియస్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి.

సిరీస్ మొదటి సగం కృష్ణమ నాయుడు – రామిరెడ్డి స్నేహం, వారి రాజకీయ ప్రవేశంపై దృష్టి సారిస్తే, రెండో సగం ఎమర్జెన్సీ ప్రభావం, అధికార మార్పులు, కొత్త నాయకుల ఎదుగుదలపై సాగుతుంది. అయితే కొన్ని ఎపిసోడ్లు (హాస్పిటల్ సీక్వెన్స్, కాలేజ్ లవ్ ట్రాక్) సగటుగా అనిపిస్తాయి. కానీ రాయపాటి చక్రధర్ రావు ఎంట్రీతో కథ వేగం పెరుగుతుంది.

Also Read :  Peddi Inside Talk: థియేటర్లలో ‘పెద్ది’ సునామీ.. మైండ్ బ్లోయింగ్ ఇన్‌సైడ్ టాక్!

టెక్నికల్ అంశాలు
కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ డైరెక్షన్ పీరియడ్ ఫీలింగ్ తీసుకొచ్చాయి. కొన్ని VFX షాట్స్ బలహీనంగా ఉన్నప్పటికీ, మ్యూజిక్ ముఖ్యంగా శక్తికాంత్ ఇచ్చిన “సహోదర” పాట గుర్తుండిపోతుంది. దేవాకట్టా మార్క్ డైరెక్షన్ అనేక సన్నివేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

పర్ఫార్మెన్స్‌లు
ఆది పినిశెట్టి, చైతన్య రావు ఇద్దరూ తమ పాత్రల్లో బాగా ఒదిగిపోయారు. ముఖ్యంగా చైతన్య రావు ఎన్నికల ప్రచార సన్నివేశంలో గట్టిగా ఇంపాక్ట్ చూపించారు. బాంబుల శివారెడ్డిగా శంకర్ మహంతి, రాయపాటి చక్రధర్ రావుగా సాయి కుమార్ అద్భుతమైన నటన కనబరిచారు. ఐరావతి బసుగా దివ్యా దత్తా పాత్రకు తగిన ఘనతను తెచ్చారు.

మొత్తం మీద
మయసభ తొమ్మిది ఎపిసోడ్లతో ఉత్కంఠభరితమైన రాజకీయ డ్రామా అనిపిస్తుంది. మొదటి సీజన్‌లో పెద్దగా వివాదాలకు తావివ్వకుండా ముగించబడింది. కానీ చివరి లీడ్ చూస్తుంటే రెండో సీజన్‌తోనే అసలు తుఫాన్ రాబోతుందనే క్లూ ఇస్తుంది.