రివ్యూ : కాంత | Kaantha Movie Review

Kaantha review

తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5

దుల్కర్ సల్మాన్–భాగ్యశ్రీ బోర్సే జంటగా, రానా–దుల్కర్ సంయుక్తంగా నిర్మించిన పీరియడ్ డ్రామా కాంత ఇప్పటికే రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను సృష్టించింది. ముఖ్యంగా దర్శకుడిగా, నటుడిగా సమానంగా మెప్పించే సముద్రఖని కీలకపాత్ర చేయడం సినిమాపై ఆసక్తి మరింతగా పెంచింది. ఒకసారి వాయిదా పడినప్పటికీ, చివరకు నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని విడుదలకు ముందే తమిళంలో రెండు రోజులక్రితం, తెలుగులో ఒక రోజు ముందే ప్రీమియర్స్‌గా చూపించటం టీమ్ తమ సినిమా మీద ఉన్న నమ్మకాన్ని చూపించింది. కొత్త దర్శకుడు సెల్వరాజ్ సెలవమణి తీసుకున్న ఈ పీరియడ్ కథ వాస్తవంగా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.

కథ : 1950–60ల చెన్నై స్టూడియోలు నేపథ్యంగా ‘కాంత’ కథ సాగుతుంది. ప్రముఖ దర్శకుడు అయ్యా (సముద్రఖని) ఒకప్పుడు తన చేతిలో నుంచి స్టార్‌గా ఎదిగిన మహదేవన్‌ (దుల్కర్ సల్మాన్) తో గొడవపడి మధ్యలో ఆగిపోయిన శాంత సినిమాను మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తాడు. ఈసారి హీరోయిన్‌గా తన శిష్యురాలు కుమారిని (భాగ్యశ్రీ బోర్సే) తీసుకుంటాడు. మొదట మహదేవన్‌పై అసహనం ఉన్న కుమారి, అతని నిజ స్వభావాన్ని తెలుసుకుంటూ ప్రేమలో పడుతుంది. వారి ప్రేమ గర్భధారణ వరకు దారి తీస్తుంది, కానీ వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో ఆమె రహస్యంగా హత్యకు గురవుతుంది. ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? నిజానికి ఈ కథ నిజ జీవిత ప్రముఖ త్యాగరాజ భాగవతార్ జీవితానికి సంబంధించినదా? ఇవన్నీ తెలుసుకోవడానికి పోలీస్ ఆఫీసర్‌గా రంగంలోకి దిగిన రానా దర్యాప్తు కీలకం అవుతుంది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

విశ్లేషణ : సినిమా ప్రారంభం నుంచే అనవసరమైన డైలాగులు లేకుండా నేరుగా కథలోకి తీసుకెళ్లడం దర్శకుడు సెల్వరాజ్ సెలవమణి తీసుకున్న ధైర్యమైన నిర్ణయం. మొదటి భాగం పూర్తిగా క్లాసిక్ ఫిల్మ్ స్టూడియో వాతావరణాన్ని గుర్తు చేస్తూ ‘మహానటి’ ఫ్లేవర్‌ను అందిస్తుంది. హీరోయిన్–హీరో మెల్లగా దగ్గరవుతున్న ట్రాక్ సాఫ్ట్‌గా నడుస్తుంది. అయితే ఆమె హత్యతో కథ ఒక్కసారిగా మర్డర్ మిస్టరీ డ్రామాగా మారిపోవడం సినిమాకు కొత్త షేడ్స్ ఇవ్వుతుంది. కథ పెద్దగా ట్విస్టులు లేకపోయినా, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైలక్షన్, బీజీఎమ్ కలిసి స్లో నేరేషన్‌ను కూడా ఎంగేజ్ చేస్తాయి. ప్యూర్ డ్రామాతో నడిచే ఈ కథ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు, కానీ సినిమా తీసిన తీరు మాత్రం టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

నటీనటుల నటన : ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యుత్తమ నటన కనబరిచాడు. అతని ఎమోషనల్ రేంజ్, స్టార్ ప్రెజెన్స్ కథను ముందుకు తీసుకెళ్లే ప్రధాన బలం. సముద్రఖని కూడా అతనికి సమానంగా స్క్రీన్‌ను షేర్ చేస్తూ శక్తివంతమైన నటన చూపించాడు. భాగ్యశ్రీ బోర్సే అనుకున్నదానికంటే మంచి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఆమె పాత్ర సినిమాకి హృదయం లాంటిది. రానా చిన్న రోల్‌లో కనిపించినా, తన స్టైల్, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సెకండ్ హాఫ్‌కే నడుము పట్టాడు. పక్కపాత్రల ఎంపిక, వారి నటన కూడా చాలా నేచురల్‌గా ఉన్నాయి.

ఫైనల్ గా : ‘కాంత’ అందరి కప్ ఆఫ్ టీ కాదు. ఇది కమర్షియల్ ఫార్ములాలు లేకుండా, పూర్తిగా డ్రామా–పర్ఫార్మెన్స్‌ల మీద నడిచే పీరియడ్ మిస్టరీ డ్రామా. కానీ అద్భుతమైన నటన, అద్భుతమైన ఆర్ట్ వర్క్, శ్రద్ధతో తీసిన క్లాసిక్ ఫిల్మ్ సెటప్‌ను ఆస్వాదించేవారికి మాత్రం ఇది తప్పక చూడదగ్గ సినిమా. స్టెల్లార్ పర్ఫార్మెన్స్‌ల కోసం ‘కాంత’ తప్పక చూడాలి.

తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5