Naga Babu: మెగా బ్రదర్ నాగబాబుకు క్యాబినెట్‌ ర్యాంక్‌.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Naga Babu

Naga Babu: జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోదరుడైన నాగబాబును ఏపీ-గ్రీన్‌ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి క్యాబినెట్‌ ర్యాంక్‌ హోదా కల్పించినట్లు సమాచారం. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడం, అటవీ విస్తీర్ణాన్ని విస్తరించడం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయం చేయడం నాగబాబు ప్రధాన బాధ్యతగా ఉండనుంది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, చెట్ల కవరేజీని కలిపి 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఏపీ-గ్రీన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది.

ఈ లక్ష్యాన్ని సాధించేందుకు జిల్లాల స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపు కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇప్పటికే ఉన్న సోషల్‌ ఫారెస్ట్రీ విభాగాలను డిస్ట్రిక్ట్‌ గ్రీనింగ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలుగా మార్చడంతో పాటు.. కొత్త జిల్లాల్లోనూ ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పర్యావరణం, అటవీ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ పెంపు, పునర్వనీకరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో నాగబాబు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి రాష్ట్రాన్ని మరింత పచ్చగా మార్చే దిశగా కృషి చేస్తారని అటవీ శాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. నాగబాబుకు క్యాబినెట్‌ ర్యాంక్‌ హోదాతో కీలక పదవి దక్కడంతో జనసేన శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ఆయనకు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.