
Jr NTR: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఒక వేదికపైకి వచ్చారంటే అక్కడ వైబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అభిమానులను ఉర్రూతలూగించే పంచ్‌లు, పవర్ఫుల్ స్పీచ్‌లే కాకుండా.. అప్పుడప్పుడు గుండె లోతుల్లోని నిజాలను నిర్భయంగా పంచుకుంటూ భావోద్వేగానికి గురిచేస్తుంటారు. తాజాగా ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్లో తారక్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా కార్తికేయతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకుంటూ తారక్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషన్‌గా మారాయి.
“మా అమ్మకు ఇంకొకడు పుట్టి ఉంటే వాడే!”
వేదికపై కార్తికేయను ఆత్మీయంగా హత్తుకున్న ఎన్టీఆర్, వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం సినిమాకే పరిమితం కాదని స్పష్టం చేశారు. “స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా మొదలుపెట్టినప్పుడు నాకు 17 ఏళ్లు.. కార్తికేయకు తొమ్మిదేళ్లు. ఎనిమిదేళ్ల చిన్నోడు వాడు. మా అమ్మని ఎప్పుడూ ఒకటే అడిగేవాడిని.. ‘నన్ను ఒక్కడినే కన్నావేంటమ్మా, తోడుగా ఇంకొకరు ఉంటే బాగుండేది కదా’ అని. కానీ ఈరోజు ధైర్యంగా చెబుతున్నా.. ఒకవేళ మా అమ్మకి ఇంకో కొడుకు పుట్టి ఉంటే, అది కచ్చితంగా కార్తికేయే అయ్యేవాడు. నా జీవితంలో వాడికి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు” అంటూ ఎన్టీఆర్ చెప్పిన మాటలు అక్కడున్న వారందరి హృదయాలను హత్తుకున్నాయి.
“సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు నా పక్కన నిలబడ్డాడు”
తన కెరీర్లో ఒడిదుడుకులు ఎదురైన రోజులను తారక్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఒకానొక దశలో సినిమాలు సరిగ్గా ఆడక తీవ్ర నైరాశ్యంలో ఉన్నప్పుడు కార్తికేయ తనకు కొండంత అండగా నిలిచాడని చెప్పారు. “సినిమాలు ఆడట్లేదు, ఏం చేయాలో పాలుపోని అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. అభిమానులైన మీరు నన్ను ఎలా భుజాన మోశారో, తెర వెనుక నాకు తెలియకుండానే కార్తికేయ అలాగే నిలబడ్డాడు. నా మొహంపై కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక వాడున్నాడు. నా కళ్లలో నీళ్లు తిరిగిన ప్రతిసారీ వాటిని తుడిచిన వేళ్లలో మీ చేతులతో పాటు వాడి చెయ్యి కూడా ఉంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల విజయం వెనుక రాజమౌళి గారితో పాటు నిశ్శబ్దంగా శ్రమించిన సైనికుడు కార్తికేయ” అని తారక్ కొనియాడారు.
“ఆ రోజు ఒక్కడినే వెళ్లాను.. ఎవరూ రాలేదు”
తన సినీ ప్రస్థానం మొదలైన తొలి రోజులను గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “2000 నవంబర్ 16న నా తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ ఓపెనింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. రామోజీరావు గారు నిర్మాత, ప్రతాప్ గారు దర్శకుడు. ఆ రోజు ఓపెనింగ్‌కు అమ్మని రమ్మంటే బయటకు రానంది. సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో నాన్న కూడా రాలేదు. తెల్లవారుజామునే ఒంటరిగా ఫిల్మ్ సిటీకి వెళ్లాను. పూజ జరుగుతున్నప్పుడు నన్ను పట్టుకుని ఆశీర్వదించడానికి, వెన్నుతట్టడానికి కుటుంబం నుంచి ఎవరూ లేరనే చిన్న బాధ నన్ను వెంటాడింది. కానీ, ఆ తర్వాత దేవుడు నా వెనుక మీ అందరి ప్రేమాభిమానాలను కొండంత అండగా నిలబెట్టాడు. ఆ తర్వాతే నాకు రాజమౌళి, కీరవాణి గారి కుటుంబాలు దక్కాయి”* అని తారక్ గతాన్ని నెమరువేసుకున్నారు.
ఫహద్‌తో ‘తొడగొట్టించిన’ తారక్.. డ్రాగన్ అప్డేట్
ఈ వేదికపై సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. యాంకర్ కోరిక మేరకు ఫహద్ ఫాజిల్‌తో కలిసి పక్కా మాస్ స్టైల్లో తొడకొట్టి సభను హోరెత్తించారు. ఇటీవల చేతికి సర్జరీ జరగడం వల్ల కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నానని, ప్రస్తుతం చేయి పూర్తిగా కోలుకుందని.. త్వరలోనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ (‘డ్రాగన్’) షూటింగ్ మొదలుపెడతానని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికే సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చారు. చివరగా తన తమ్ముడు కార్తికేయ నిర్మాతగా, టాలెంటెడ్ డైరెక్టర్ శశాంక్ దర్శకత్వంలో, వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రాన్ని ప్రేక్షకులు నిండు మనసుతో ఆశీర్వదించాలని ఎన్టీఆర్ కోరారు.














