
Jailer 2: సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జైలర్ 2’ విడుదలకు ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు తొలి వారం రోజులు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. అక్టోబర్ 15న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి పెంచిన టికెట్ ధరలు విడుదలైన మొదటి ఏడు రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని నిర్మాణ సంస్థ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి అదనంగా రూ.50 వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో ఈ పెంపు రూ.75 వరకు ఉండనుంది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఈ ధరలు వర్తించనున్నాయి.
2023లో విడుదలైన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్, అనిరుధ్ రవిచందర్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఎలా అలరిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి నేపథ్యంలో తొలి వారం వసూళ్లపై ఆసక్తి నెలకొంది. మరి ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందో చూడాలి.













