
Vijay Deverakonda: ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సామాన్య ప్రేక్షకుడిని థియేటర్లకు దూరం చేస్తున్న ప్రధాన సమస్య టికెట్ ధరల మోత. భారీ బడ్జెట్, పాన్-ఇండియా సినిమాల పేరుతో మొదటి వారం టికెట్ రేట్లను ఆకాశానికి పెంచేస్తుండటంతో సగటు సినీ ప్రియుడు థియేటర్ వైపు చూడటానికే జంకుతున్నాడు. ఫలితంగా కంటెంట్ బాగున్నా సరే, కలెక్షన్లు రాక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తీసుకున్న బోల్డ్ డెసిషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన విజయ్, టికెట్ రేట్ల దోపిడీపై సూటిగా స్పందించారు. “రణబాలి సినిమాకే కాదు.. భవిష్యత్తులో నేను చేసే ఏ సినిమాకూ టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదు. బడ్జెట్ ఎక్కువైందని ప్రేక్షకుల జేబులను గుల్ల చేయడం సరికాదు. ఒకవేళ సినిమా నిర్మాణ వ్యయం పెరిగితే.. నా నిర్మాతలతో కూర్చుని మాట్లాడతాను. అవసరమైతే నా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాను లేదా మరో ప్రత్యామ్నాయం చూస్తాను అంతే తప్ప ప్రేక్షకులపై భారం మోపను” అని కుండబద్దలు కొట్టారు.
ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ మరో ఆసక్తికర కామెంట్ చేశారు. “ఎప్పుడైనా రాజమౌళి సర్‌తో సినిమా చేస్తే తప్ప.. నా సినిమాలకు టికెట్ల రేట్ల పెంపు అనేది అస్సలు ఉండదు” అని నవ్వుతూనే తేల్చిచెప్పారు. స్టార్ హీరోలు తమ సినిమాలకు అధిక రేట్ల పర్మిషన్లు తెచ్చుకుంటున్న ప్రస్తుత తరుణంలో, విజయ్ దేవరకొండ ఓపెన్‌గా ఇలాంటి హామీ ఇవ్వడం సాధారణ ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. రేట్లు పెంచకుండా సాధారణ ధరలతోనే బరిలోకి దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’కి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.














