
Anupama: న్యాచురల్ యాక్టింగ్‌తో, విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ ప్రియుల మనసుల్లో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పెళ్లి వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని ఆనందంగా గడపడానికి చేసుకునే బంధం.. అంతే తప్ప, ఒక అమ్మాయిని ఇంట్లోకి తెచ్చి పనిమనిషిగా మార్చడానికి కాదు” అంటూ ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నరేశ్ విజయకృష్ణ, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ఉడ్డెమారితో కలిసి ఆమె నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘క్రేజీ కళ్యాణం’. భద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా అనుపమ విలేకరుల సమావేశంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సినిమాలో తను పోషించిన ‘కీర్తి’ పాత్ర దృక్పథం గురించి వివరిస్తూనే, వ్యక్తిగతంగా కూడా తన ఆలోచనా విధానం అదేనని అనుపమ కుండబద్దలు కొట్టారు. “సమాజంలో పెళ్లి పేరుతో అమ్మాయిలపై ఉండే ఆంక్షలు సరైనవి కావు. అయితే, సినిమాలో నా పాత్ర పడే తిప్పలు తెరపై నవ్వులు పూయిస్తాయి. నిజ జీవితంలో మా ఇంట్లో మాత్రం నా పెళ్లి విషయంలో ఎలాంటి ఒత్తిడీ లేదు” అని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో తెలంగాణ యాస మాట్లాడుతూ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నట్లు ఆమె వెల్లడించారు. సినిమాలోని ఎమోషన్స్ గురించి చెబుతూ.. “మా అమ్మానాన్నలకు తెలుగు రాదు. అయినా సినిమా చూశాక భావోద్వేగాలకు లోనై ఎంతగానో ప్రశంసించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే కథలా ఇది ఉంటుంది. పండగ పూట కుటుంబమంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునే అనుభూతిని ఈ చిత్రం ఇస్తుంది” అని తెలిపారు. అలాగే నరేశ్, తరుణ్ భాస్కర్ (‘బాలరాజు’ పాత్ర) లతో కలిసి చేసిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయని పేర్కొన్నారు.
రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా పాత్రలకు తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని అనుపమ తేల్చిచెప్పారు. “డబ్బు సంపాదించడం కోసమే సినిమాల్లోకి రాలేదు. వెండితెరపై నన్ను నేను విభిన్నంగా ఆవిష్కరించుకోవడమే నా లక్ష్యం. పాత్ర పేరు చెబితే సినిమా గుర్తొచ్చేలా కథలను ఎంచుకుంటాను” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నట్లు ఆమె వివరించారు.














