Vidya Balan: మళ్లీ ఆ బోల్డ్ అవతారానికి రెడీ: విద్యాబాలన్

Vidya Balan

Vidya Balan: వెండితెరపై గ్లామర్ హద్దులను చెరిపేస్తూ, విలక్షణ నటనతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అరుదైన హీరోయిన్లలో విద్యాబాలన్ ఒకరు. లేటెస్ట్‌గా ‘జైలర్ 2’లో కాంత పాత్రతో థియేటర్లలో రచ్చ లేపిన ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ మైలురాయి అయిన ‘ది డర్టీ పిక్చర్’ సీక్వెల్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘ది డర్టీ పిక్చర్’ సినిమా విడుదలై దాదాపు 15 ఏళ్లు గడిచినా.. అలాంటి పవర్‌ఫుల్ బోల్డ్ పాత్రను మళ్లీ చేయాలనే కోరిక తనలో ఏమాత్రం తగ్గలేదని విద్యాబాలన్ కుండబద్దలు కొట్టారు. “ఏక్తా కపూర్ ఈ సినిమాకు పార్ట్-2 ప్లాన్ చేస్తున్నట్లు నేనూ విన్నాను. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటా. మొదటి భాగంతోనే సిల్క్ స్మిత కథ పూర్తిగా ముగిసిపోయింది.

కాబట్టి సీక్వెల్‌లో బహుశా మరో సరికొత్త కథను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి కానీ, మళ్లీ అలాంటి ఓ బలమైన పాత్రలో నటించాలనే తపన నాలో ఇంకా అలానే ఉంది” అని వెల్లడించారు. మంచి రోల్స్ దొరికితే అస్సలు వదులుకోనని చెబుతూ.. “పాత్రల విషయంలో నేను ఎప్పుడూ అత్యాశపడే నటినే, ఈ మాటను నేను ఇప్పటికీ గర్వంగా చెబుతా. ఏదైనా కథ నన్ను కదిలిస్తే చాలు.. ఎలాంటి సంకోచం లేకుండా ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోతా” అని స్పష్టం చేశారు. ‘డర్టీ పిక్చర్ 2’లో నటించేందుకు తాను సిద్ధమేనంటూ విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.