
Nandana: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూకేలో భారీ వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైన నేపథ్యంలో.. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.
నందన తన భర్తతో కలిసి ‘నందుs vlogs’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో యూకేలో మంచి వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులను నమ్మించి భారీ మొత్తంలో నగదు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. డబ్బులు చెల్లించిన తర్వాత హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగాలు కల్పించలేదని బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటికే నందన లండన్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో దుబాయ్ నుంచి తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ప్రత్యేక బృందం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.
సుమారు 10 గంటల పాటు పోలీసుల కస్టడీలో ఉన్న నందన విచారణకు పూర్తిస్థాయిలో సహకరించలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అనంతరం ఆమెను విమానాశ్రయం నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. ముఖానికి ముసుగు ధరించి మాట్లాడకుండా కారులో వెళ్లిపోయారు. మరోవైపు నందన కుటుంబ సభ్యులు మాత్రం ఆమెపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. విచారణ పూర్తికాకముందే నందనను దోషిగా చిత్రీకరించడం సరికాదని వారు అంటున్నారు. చట్టంపై తమకు పూర్తి గౌరవం ఉందని, పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులు, ఆర్థిక లావాదేవీలు, విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగిన వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.









