Balakrishna Injury: బాలయ్యకు ఏమైంది? ఆందోళనలో అభిమానులు! టీం క్లారిటీ ఇదే..

Balakrishna

Balakrishna Injury: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK111. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణకు స్వల్ప మసిల్ టియర్ అయినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ వార్తతో అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. చిత్రబృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. వైద్యుల సూచన మేరకు బాలకృష్ణ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఒక చిన్న మైనర్ సర్జరీ చేయనున్నారని చెప్పారు. ఇది సాధారణ వైద్య ప్రక్రియ మాత్రమేనని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది.

అలాగే సినిమాపై బాలకృష్ణకు ఉన్న అంకితభావం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం NBK111 చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తోందని చిత్రబృందం పేర్కొంది. గాయం అయినప్పటికీ ఆయన చూపించిన నిబద్ధతపై యూనిట్ సభ్యులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్రబృందం మరోసారి స్పష్టం చేసింది. బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ వార్త తెలిసిన తర్వాత అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్ చేస్తున్నారు.