Om:”అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది!”.. నవంబరు 20న థియేటర్లలోకి ధనుష్ ‘ఓం’

Om

Om:విలక్షణ నటుడు ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘ఓం’ రిలీజ్ తేదీలో ఊహించని మార్పు చోటుచేసుకున్న విషయంలో తెలిసిందే. ఇటీవల స్వయంగా ధనుష్ సోషల్ మీడియా వేదికగా దసరా రేసు నుంచి ఓం సినిమా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా మేకర్స్ “అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది” అంటూ సరికొత్త పోస్టర్‌ను రంగంలోకి దించారు. ఈ చిత్రాన్ని నవంబరు 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు స్పష్టం చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాల ఆధిపత్య పోరు నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే రిలీజ్ అయిన పోస్టర్లలో ధనుష్ రగ్గడ్ అవతార్, సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో అత్యంత పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ స్థాయి మరింత పెరిగింది. తెరపై ధనుష్, మమ్ముట్టి మధ్య నడిచే సన్నివేశాలు థియేటర్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తాయని సమాచారం. న్యాచురల్ యాక్టింగ్‌తో మెప్పించే సాయిపల్లవి, తన డ్యాన్స్‌లతో యూత్‌ను ఉర్రూతలూగించే శ్రీలీల ఇద్దరూ ఇందులో హీరోయిన్లుగా నటిస్తుండటం ప్రాజెక్ట్‌‌పై మరింత హైప్ తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ నెల 16నే ప్రేక్షకులను పలకరించాల్సి ఉన్నప్పటికీ, బాక్సాఫీక్ వద్ద పోటీకి దిగడం ఇష్టం లేక రిలీజ్‌ను నవంబరు 20కి మార్చినట్లు తెలుస్తోంది. ఇద్దరు టాప్ హీరోయిన్లు, మమ్ముట్టి వంటి లెజెండరీ యాక్టర్ తోడవ్వడంతో ధనుష్ కెరీర్‌లోనే ‘ఓం’ ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.