72nd National Film Awards: 72వ జాతీయ అవార్డుల్లో ‘కల్కి 2898 ఏడీ’ డబుల్ ధమాకా..

72nd National Film Awards

72nd National Film Awards: ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’. తాజాగా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తూ.. మరోసారి తెలుగు సినిమా సత్తాను జాతీయ స్థాయిలో చాటింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తాజాగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో (2024) రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ చిత్రానికి ‘ఉత్తమ ప్రజాదరణ పొందిన సంపూర్ణ వినోదాత్మక చిత్రం’ (Best Popular Film Providing Wholesome Entertainment) విభాగంలో జాతీయ అవార్డు లభించింది.

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారతీయ పురాణాలను భవిష్యత్ ప్రపంచంతో మేళవిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అంతేకాదు చిత్రంలోని అద్భుతమైన విజువల్ ప్రపంచాన్ని సృష్టించినందుకు నితిన్ జిహానీ చౌదరికి ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ (Best Production Designer) విభాగంలో జాతీయ అవార్డు ప్రకటించారు. సినిమాలో కనిపించిన భవిష్యత్ నగరాలు, భారీ సెట్స్, వినూత్న డిజైన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుదల సమయంలో ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.