
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మరోసారి తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఆయన వెల్లడిస్తూ వర్కౌట్ ఫోటోలను పంచుకున్నారు. సౌకర్యం కోసం సాకులు చెప్పకుండా కష్టపడాలని నిర్ణయించుకున్నానని మనోజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. యాక్షన్ సినిమాల్లో ప్రతి పంచ్, ప్రతి దెబ్బ నిజంగానే తట్టుకోవాల్సి ఉంటుందని, కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదని ఆయన చెప్పారు. కేవలం లుక్ కోసం కాకుండా శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టానని, తాను మరింత ధృడమైన వ్యక్తిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.
ఇటీవల విడుదలైన సినిమాలతో మంచు మనోజ్ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా “మిరాయ్” సినిమాలో మహాబీర్ లామా అనే శక్తివంతమైన విలన్ పాత్రలో ‘బ్లాక్ స్వోర్డ్’గా కనిపించి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంలో ఆయన చూపించిన శారీరక శక్తి, భావోద్వేగ నిబద్ధతకు ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ విజయంతో మనోజ్ కెరీర్‌లో మరో కొత్త దశ ప్రారంభమైనట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం మంచు మనోజ్ “డేవిడ్ రెడ్డి” అనే భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. హనుమ రెడ్డి యెక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి నిర్మిస్తున్నారు. 1897 నుంచి 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ధైర్యవంతుడైన యోధుడి కథను ఇందులో చూపించనున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. దీంతో “డేవిడ్ రెడ్డి”లో మనోజ్ న్యూ అవతార్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.












