
Naga Vamsi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగ వంశీ వరుసగా స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో గాడ్ ఆఫ్ వార్ అనే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను చేస్తున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కూడా సినిమా చేయడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం రామ్ చరణ్ తన కమిట్‌మెంట్లను పూర్తి చేసిన తర్వాత, ముఖ్యంగా RC17 అనంతరం నాగ వంశీ బ్యానర్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు స్టార్ దర్శకులతో కథలపై చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.
రామ్ చరణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథ కోసం అన్వేషణ కొనసాగుతోందని, సరైన కథ రెడీ అయితే ఈ కాంబినేషన్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పలువురు ప్రముఖ దర్శకులు చెప్పిన కథలను నాగ వంశీ పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్‌లో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగ వంశీ, భవిష్యత్ ప్రాజెక్ట్‌ల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే, రామ్ చరణ్ అభిమానులకు ఇది మరో క్రేజీ అప్డేట్‌గా మారే అవకాశం ఉంది. అయితే రామ్ చరణ్ సినిమాపై ఇప్పటివరకు నాగవంశీ, ఆయన టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.














