NBK111 Release Date: డిసెంబర్ 24న బాలయ్య మాస్‌ జాతర.. ‘NBK111’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

NBK111

NBK111 Release Date: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘NBK111’పై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన అప్‌డేట్‌ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాకినాడలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో ఆయన మోకాలికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య.. త్వరలోనే తిరిగి ‘NBK111’ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. హీరో అందుబాటులోకి వచ్చిన తర్వాత చిత్రీకరణను వేగవంతం చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

అక్టోబర్, నవంబర్ నెలల్లో నాన్‌స్టాప్‌గా షూటింగ్ నిర్వహించి.. నవంబర్ చివరి నాటికి టాకీ పార్ట్‌తో పాటు పాటల చిత్రీకరణను పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు సమాచారం. అనంతరం డిసెంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్‌ను కూడా వేగవంతం చేసి, క్రిస్మస్ హాలిడేస్‌ను క్యాష్ చేసుకునేలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు ‘NBK111’పై అంచనాలు మరింత పెరిగాయి. హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే డిసెంబర్ 24 విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.