
Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. ఈ పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాస్తవానికి ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ సరికొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. వచ్చే ఏడాది దీపావళి పండుగ కానుకగా.. అంటే 2027 అక్టోబర్ 29న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను వదిలారు.
రిలీజ్ డేట్ మారడంపై మొదట కాస్త నిరాశ వ్యక్తమైనప్పటికీ, అందుతున్న సమాచారం చూసి డార్లింగ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. సందీప్ వంగా మార్క్ రా అండ్ ఇంటెన్స్ స్టైల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయట. ఈ ఎపిసోడ్లో ప్రభాస్ మునుపెన్నడూ చూడని అత్యంత క్రూరమైన, వైల్డ్ మాస్ అవతారంలో వెండితెరపై ఊచకోత కోయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు కథాంశమే ఇప్పటివరకు భారతీయ తెరపై రాని రీతిలో అత్యంత కొత్తగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
మరోవైపు 2026 డిసెంబర్లో రావాల్సిన ప్రభాస్ పీరియాడిక్ మూవీ ‘ఫౌజీ’ సైతం 2027కి పోస్ట్‌పోన్ అయిన సంగతి తెలిసిందే. దీనితో 2027లోనే అటు ‘ఫౌజీ’, ఇటు దీపావళికి ‘స్పిరిట్’.. ఇలా రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద డబుల్ ధమాకా ఇవ్వడం ఖాయమైపోయింది. ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఇంకా తేలాల్సి ఉన్నప్పటికీ, ఒకే ఏడాదిలో డార్లింగ్ నుంచి రెండు విభిన్నమైన భారీ చిత్రాలు వస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.













