
Rashmika: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై విమర్శలు, ట్రోలింగ్స్ రావడం సహజమే అయినా.. కొన్నిసార్లు అది హద్దులు దాటుతుంటుంది. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏ చిన్న పని చేసినా కొందరు పనిగట్టుకుని ట్రోల్ చేయడం నెట్టింట చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటివరకు ఈ విమర్శలను చిరునవ్వుతో దాటేస్తూ వచ్చిన ఈ భామ, తాజాగా గీత దాటుతున్న ట్రోలర్స్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్న వారికి సూటిగా, స్పష్టంగా గట్టి సమాధానమిచ్చారు.
రష్మిక నటించిన భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ల వేదికగా తన వ్యక్తిత్వంపై వస్తున్న కామెంట్స్‌కు ఆమె గట్టిగా బదులిచ్చారు. “నేను అందరితో సరదాగా, స్నేహపూర్వకంగా ఉండటాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నవ్వుతూ మాట్లాడటం, అందరితో మంచిగా ఉండటం నా బలహీనత ఎంతమాత్రం కాదు” అని రష్మిక కుండబద్దలు కొట్టారు. “నేను ఉండే ప్రతి చోటా పాజిటీవిటీ ఉండాలని, నవ్వులు ఉండాలనే కోరుకుంటాను. నా సరదా స్వభావం వల్ల నా కుటుంబం, నా స్నేహితులు హ్యాపీగా ఉంటారు. దీనికి ఎవరు ఏ పేరు పెట్టినా నాకు లెక్కలేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నేను నచ్చాలనే రూల్ లేదు.. అలాగని ఎవరికోసమో నా స్వభావాన్ని మార్చుకోలేను” అంటూ ట్రోలర్స్ ముఖం మీదే తేల్చిచెప్పారు. అక్టోబర్ 16న బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమైన ‘రణబాలి’ ప్రమోషన్లలో రష్మిక చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.














